NTV నిర్వహించిన GHMC ఎన్నికల సర్వే ఫలితాలు ఇదిగో..

NTV Nielsen Survey in GHMC polls 2016
NTV Nielsen Mindframe Survey in GHMC polls 2016

తెలంగాణ ఏర్పడిన తర్వాత.. GHMCకి జరుగుతున్న తొలి ఎన్నికలివి. 70లక్షలమంది ఓటర్లలో సగం ఉన్న సీమాంధ్రులు చూపు ఇప్పుడు ఎటు వైపు ఉంది? అలాగే కులాల వారీగా పార్టీలకు ఓట్లు పడతాయా? ఒకప్పుడు GHMCని ఏలిన పార్టీలు ఇప్పుడు అదే ప్రాభవాన్ని నిలబెట్టుకుంటాయా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌… తన జోరుని హైదరాబాద్‌లోనూ కొనసాగించగలదా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికింది ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్‌ ఫ్రేం సర్వే.

హైదరాబాద్‌ ప్రజల తీర్పే అసలైన తీర్పని అన్ని పార్టీలూ భావిస్తున్న తరుణంలో…జంటనగరాల జనంమదిలో ఉన్నది తెలుసుకోవడం కత్తి మీద సాము లాంటిది. అయినా ఎన్టీవీ నీల్సన్‌ ఎన్జీ మైండ్‌ ఫ్రేమ్‌ జనంనాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌ GHMCలో మొత్తం 150 డివిజన్లకు గానూ టీఆర్ఎస్‌ అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ 75 నుంచి 85 డివిజన్లు దక్కించుకోవచ్చని సర్వే అంచనాలు చెప్తున్నాయి. అలాగే టీడీపీ, బీజేపీ కూటమికి 20 నుంచి 25 డివిజన్లు దక్కే అవకాశం ఉంది. ఇక జంట నగరాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. కాంగ్రెస్‌ 10 నుంచి 12 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. పాతబస్తీలో ఎంఐఎం కంచుకోట నిక్షేపంగా ఉంది. జంటనగరాల్లో మిగిలిన ప్రాంతాల్లో ప్రభావాన్ని కనిపించకపోయినా ఓల్డ్‌ సిటీలో మాత్రం MIM జెండా ఎగురుతోంది. GHMC ఎన్నికల్లో MIM 40 నుంచి 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 3 స్థానాలు దక్కవచ్చు. GHMC ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చో మరోసారి చూద్దాం. టీఆర్‌ఎస్‌ 75- 85 డివిజన్లు, టీడీపీ బీజేపీ కూటమి 20 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లు, MIM 40 నుంచి 45 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులకు మూడు స్థానాలు రావచ్చు.

మొత్తంగా హైదరాబాద్‌లో 150డివిజన్లలో ప్రజల్ని కలిపి ఏపార్టీ జనం సమస్యల్ని పరిష్కరిస్తుందని మీరు నమ్ముతున్నారని అడిగితే…టీఆర్‌ఎస్‌ వైపు 63 శాతం మొగ్గు చూపారు. బీజేపీ వైపు 12, టీడీపీ వైపు 9, కాంగ్రెస్‌ వైపు 9 శాతం ప్రజలు ఉన్నారు. పాతబస్తీకే పరిమితమయ్యే ఎంఐఎంపై మిగిలిన జోన్లలో 6 శాతం మాత్రమే ప్రజలు విశ్వసిస్తున్నారు. వైఎస్సార్సీపీని హైదరాబాద్‌ ప్రజలు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆసక్తి కరమైన అంశం ఏంటంటే.. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనం టీఆర్‌ఎస్‌ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

హైదరాబాద్‌లో జనం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు పరిష్కారమయ్యాయా? అయితే ఏ మేరకు అయ్యాయి. హైదరాబాద్ జనం ఏమనుకుంటున్నారు అన్న అంశంపై ఎన్టీవీ నీల్సన్‌, ఎన్‌ జీ మైండ్‌ ఫ్రేమ్‌ సర్వే దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిథిలో అవినీతి ఎలా ఉంది అని ప్రశ్నిస్తే…28మంది కరప్షన్ ఇంకా పెరిగిందని….45మంది అప్పటిలాగే ఉందని అభిప్రాయపడ్డారు. 27 శాతం మాత్రం అవినీతి, లంచాలు తగ్గాయంటున్నారు. ఓవరాల్‌గా అవినీతి విషయంలో 73శాతం ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. తాగునీటి సరఫరా ఎలా ఉందంటే మెరుగుపడిందని 44శాతం జనం అంటున్నారు. 37శాతం మార్పేమీ లేదు. 18శాతం ఒకప్పటికంటే దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. తాగునీటి సరఫరా విషయంలో సర్కారుకు 44 మార్కులే వస్తున్నాయి. హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎలా ఉందని ప్రశ్నిస్తే.. పరిస్థితి మెరుగు పడిందని 34 మంది, ఏ మార్పూ లేదని 45 మంది, ఇంకా అధ్వాన్నంగా తయారైందని 19 మంది అంటున్నారు. మహిళల భద్రతపై సర్కారుపై 34 మందికే సానుకూల అభిప్రాయం ఉంది. సిటీలో చెత్త తరలింపు ఎలా ఉంది అంటే.. 38 శాతం పరిస్థితి మెరుగైందని.. 44 శాతం ఏ మార్పూ లేదని, 18శాతం పరిస్థితి అప్పటి కంటే దారుణమని అంటున్నారు. అంటే 62 శాతం జనం… చెత్త తరలింపుపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రభుత్వ పని తీరు, కిందటి ప్రభుత్వంతో పోలిక…ఇవన్నీ కాకుండా…ముఖ్యమంత్రి KCR పని తీరు ఎలా ఉందని ప్రజల అభిప్రాయం తీసుకుంది ఎన్టీవీ నీల్సన్‌ ఎన్జీ మైండ్ ఫ్రేమ్‌ సర్వే. ఈస్ట్‌ జోన్‌లో 11శాతంమంది చాలా బాగుందని, 60శాతంమంది బాగుందని, 24శాతం పరవాలేదని 3 శాతం బాగోలేదని అన్నారు. అదే సెంట్రల్ జోన్‌కి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు ఎలా ఉందని ప్రశ్నిస్తే…15శాతం చాలా బాగుందని 49 బాగుందని, 28 శాతం పర్వాలేదని చెబుతున్నారు. సెంట్రల్ జోన్‌లో వందకి ఐదుగురు మాత్రం కేసీఆర్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా 3 శాతం అస్సలు బాగోలేదని అంటున్నారు. వెస్ట్ జోన్‌ అంటే శేరి లింగం పల్లి, కూకట్‌ పల్లి, KPHB లాంటి ప్రాంతాల్లో మాత్రం ముఖ్యమంత్రి పని తీరుపై అనుహ్యమైన అనుకూల స్పందన వచ్చింది. ఇక్కడ 75 శాతం మంది జనం కేసీఆర్ పని తీరు అద్భుతం… చాలా బావుందని అంటున్నారు. 22 శాతం బాగుందని అంటుండగా 3 శాతం మాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డారు. నార్త్‌జోన్ విషయానికొస్తే 29 శాతం CM పని తీరు చాలా బాగుందని, 46 శాతం బాగుందని 19 మంది పరవాలేదని 5 శాతం బాగా లేదని అంటున్నారు.

సర్వే సందర్భంగా ఒక్క విషయం చెప్పాల్సి ఉంది. ఇది ఈ రోజు, ఇప్పుడు ఉన్న పరిస్థితి. అభ్యర్థుల ఎంపిక తర్వాత సమీకరణాలు మారవచ్చు. అభిప్రాయాల్లో మార్పు రావచ్చు. పాత బస్తీ మినహాయించి జంట నగరాల్లో 4 జోన్లలో పరిస్థితిని ఇప్పుడు మీ ముందుంచింది ఎన్టీవీ. మరో 15 రోజుల్లో GHMCలో పార్టీల స్థితిగతులపై మరో సర్వేతో తాజాగా మీ ముందుకు వస్తాం.