తెలంగాణలో వైసీపీ ఆకర్ష్‌ ..

ఖమ్మం జిల్లాలో పాగా వేసేందుకు వైసీపీ రెడీ అయ్యింది. తెలంగాణలో ఎక్కడ పట్టు లేకపోయినప్పటికీ..ఖమ్మం జిల్లాలో కొంత బలమైతే ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని..జిల్లాపై పూర్తి పట్టుకోసం వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్లమెంట్‌ సీటుతో పాటు, మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది వైసీపీ. ఆ తర్వాత అశ్వరావుపేట MLAతాటి వెంకటేశ్వర్లు, వైరా MLA మదన్‌లాల్‌లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో పార్టీ క్యాడర్‌ కూడా అధికార పార్టీ తీర్థం తీసుకోవడంతో..ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కొంత ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు చేపట్టిన నేతలు..ఇతర పార్టీల నుంచి చేరికలు మొదలుపెట్టారు.

రెండేళ్లపాటు పార్టీని నడిపించిన పొంగులేటి, మొన్నటి MLC ఎన్నికల్లో కొంత మేరకు సక్సెస్‌ అయ్యారు. తెలంగాణలో టీడీపీ డిపాజిట్‌ రాకుండా గల్లంతైనా..ఖమ్మం జిల్లాలో వైసీపీకి పరువు దక్కింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జిల్లాలో సక్సెస్‌ అవుతున్నా…రాష్ట్రంలో ఫెయిల్యూర్‌ అయ్యాడనే ముద్ర ఉంది పొంగులేటికి.

తెలంగాణలో నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న వైసీపీ..దూకుడు పెంచిందా..? తమకు పట్టున్న ఖమ్మం జిల్లాతోటే ముహుర్తం పెట్టిందా..అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌పేరుతో ఇతర పార్టీల నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు నేతలు.

తనపై ఉన్న ముద్రను చెరపేసేందకు చర్యలు చేపట్టిన పొంగులేటి..పార్టీలోకి పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇప్పటికే కూసుమంచి నుంచి కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ బాలకృష్ణా రెడ్డిని, అదే పార్టీకి చెందిన తిరుమలాయపాలెం ఎంపీపీ అశోక్‌లను వైసీపీలోకి రప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన పలువురు వరుసగా తమ పార్టీలో చేరారని చెప్తున్నారు పొంగులేటి.

వైరా నియోజకవర్గంలో కూడ గతంలో టీఆర్‌ఎస్‌లో చేరిన అనుచర వర్గం కూడ మళ్లీ వైసిపి తీర్దం పుచ్చుకుంది. ఎన్నికల సమయంలో జరగాల్సిన ఈ తంతు..ఇపుడు జరుగుతుండడంతో కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.