సర్వేల ప్రామాణికత ఎలా?

NTV & NG Mind Frame Special Poll Survey

ఇదీ ఎన్టీవీ సర్వేల ప్రామాణికత.. జనం మనసులో ఎవరున్నారో తెలుసుకోవడమే కాదు.. పార్టీలు తమ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోడానికి, స్వీయ సమీక్ష చేసుకోడానికి ఈ సర్వేలు ఉపయోగపడతాయి. హైదరాబాద్‌ ప్రజల తీర్పే అసలైన తీర్పు అని అన్ని పార్టీలూ భావిస్తున్న తరుణంలో… జంట నగరాల జనం మదిలో ఉన్నది తెలుసుకోవడం కత్తి మీద సాము లాంటిది. ప్రధానంగా భిన్న సంస్కృతులు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాల సమ్మేళనం అయిన హైదరాబాద్‌లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో విశ్లేషించడం కష్టమే. 70 లక్షల మంది ఓటర్లలో సగం ఉన్న సీమాంధ్రులు చూపు ఇప్పుడు ఎటు వైపు ఉంది? అలాగే కులాల వారీగా పార్టీలకు ఓట్లు ఎందుకు పడలేదు? ఒకప్పుడు GHMCని ఏలిన పార్టీలు ఇప్పుడు అదే ప్రాభవాన్ని నిలబెట్టులేకపోవటానికి కారణాలేంటి? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌… తన జోరుని హైదరాబాద్‌లోనూ ఎలా కొనసాగించింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ సర్వే…

సర్వే మరింత ప్రామాణికంగా రూపొందించడానికి, హైదరాబాద్‌ GHMC ఓటర్ల మనోగతం తెలుసుకోడానికి ఎన్టీవీ విడతల వారీగా సర్వే నిర్వహించింది. సర్వేలు చేయడంలో దిట్ట అయిన అంతర్జాతీయ సంస్థ నీల్సన్‌తో పాటు, NG మైండ్‌ ఫ్రేమ్‌ సంస్థతో కలసి దశల వారీగా GHMCలో ఓటర్ల అభిప్రాయాల్ని తెలుసుకుంది.

GHMCలోని 18 సర్కిళ్లు, 5 జోన్లు ఉన్నాయి. ఒక్క సౌత్‌ జోన్ మినహాయించి అంటే పాతబస్తీని మినహాయించి వెస్ట్‌, ఈస్ట్‌, నార్త్, సెంట్రల్ జోన్స్‌లో నీల్సన్ NTV బృందాలు సర్వే చేశాయి.

ఈస్ట్‌ జోన్ అంటే కాప్రా, ఉప్పల్, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో సర్వే కొనసాగింది. అలాగే వెస్ట్‌ జోన్‌లో ఉన్న శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, కూకట్‌ పల్లి ఏరియాలు.. నార్త్‌ జోన్లో ఉన్న కుత్భుల్లాపూర్, అల్వాల్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రాంతాలు, సెంట్రల్‌ జోన్‌లో ఉన్న గోల్కోండ, మెహదీ పట్నం, లంగర్ హౌస్‌, అగాపురా, అంబర్‌ పేట్‌, కాచిగూడ, హిమాయత్‌నగర్, నల్లకుంట, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, ఖైరతాబాద్‌లో నీల్సన్‌ ఎన్టీవీ, ఎన్‌జీ మైండ్‌ ఫ్రేమ్‌ సర్వే చేసింది.

నీల్సన్‌ ఎన్టీవీ సర్వేలో ప్రభుత్వ పనితీరు పై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు నాలుగు జోన్లలో ఇలా సమాధానం వచ్చింది. ఈస్ట్‌ జోన్‌లో అంటే కాప్రా, ఉప్పల్‌, ఎల్బీ నగర్ ప్రజల్ని ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే… చాలా బాగుంది అని 8 శాతం సమాధానమివ్వగా, బాగుంది అని 61 శాతం అభిప్రాయపడ్డారు. ఫర్వాలేదు అని 27 మంది చెప్పుకొస్తే, బాగాలేదని 4 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక సెంట్రల్‌ జోన్‌ విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ఇక్కడి ప్రజల అభిప్రాయం ఇలా ఉంది. సెంట్రల్‌ జోన్లో … వందకి 12 మంది టీఆర్‌ఎస్‌ సర్కారు పనితీరు చాలా బాగుంది అని కితాబిస్తే, 51 మంది బాగుంది అని సమాధానమిచ్చారు. 27 మంది ఫర్వాలేదు అని అభిప్రాయ పడగా… అస్సలు బాగాలేదంటూ నాలుగు శాతం జనం అంటున్నారు. హిమాయత్‌ నగర్, నల్లకుంట, యూసఫ్‌ గూడ, ఖైరతాబాద్‌, అంబర్‌ పేట ప్రాంతాల ప్రజల్లో నాలుగు శాతం ప్రజలు కేసీఆర్‌ పాలన అస్సలు బాగాలేదని చెప్పుకొస్తున్నారు. కానీ ఇదే ప్రాంతంలో 12 శాతం చాలా బాగుందని, 51 శాతం బాగుందని అభిప్రాయపడటం గమనించాలి.

ఇక వెస్ట్‌ జోన్‌కి వస్తే.. శేరిలింగ పల్లి, రామచంద్రాపురం, కూకట్‌ పల్లి, ప్రాంతాలు వెస్ట్‌ జోన్‌ కిందకు వస్తాయి. ఇక్కడ కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని 73 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. 24 మంది బాగుందని అంటున్నారు. సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో సర్కారు పనితీరుపై సంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఇక చివరిది నార్త్ జోన్… అల్వాల్‌, మల్కాజ్‌గిరి, కుత్భుల్లా పూర్, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని జనాల్ని ప్రశ్నిస్తే… 26 శాతం చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. మరో 41 శాతం బాగుందని చెప్పగా, 26 శాతం ఫర్వాలేదని సమాధానమిచ్చారు. 7 శాతం మాత్రం అస్సలు బాగాలేదని చెప్పుకొచ్చారు.

మొత్తం జోన్లలో కలిపి ప్రజాభిప్రాయాన్ని సరాసరిగా చూస్తే.. ఫలితాలు ఇలా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్న ప్రశ్నకు హైదరాబాద్‌ ప్రజల్లో 24 శాతం ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని అభిప్రాయపడగా, 46 శాతం బాగుందని చెప్పుకొచ్చారు. ఇక మరో 23 శాతం ఫర్వాలేదని చెప్పగా, 5 శాతం ప్రజలు మాత్రం బాగాలేదు అని చెప్తున్నారు. వందకి ఇద్దరు మాత్రమే కేసీఆర్ పాలన అస్సలు బాగాలేదని అంటున్నారు. నీల్సన్, ఎన్‌జీ మైండ్‌ ఫ్రేమ్‌ సర్వే ప్రకారం… హైదరాబాద్‌లో 70 శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.