రాములోరి పెళ్లంటే లెక్క లేదా…

అధికారుల నిర్లక్ష్యం భద్రగిరి గోపురమంత ఎత్తున పేరుకుపోయింది. రాములోరి పెళ్లంటే లెక్క లేకుండా పోయింది. నెలనెలా ఠంచనుగా జీతం తీసుకుంటోంది అక్కడ సేవ చేయడానికేనన్న సంగతి మర్చిపోయారు. నవమి ఉత్సవాల్లో క్షమించరానంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు రామాలయం అధికారులు. అంత పెద్ద తప్పు ఏం జరిగింది? ఏ విషయంలో అధికారుల లెక్కలేనితనం బయటపడింది?

రామయ్యకు పెళ్లంటే అదేదో ఆయన సొంత వ్యవహారం కాదు. లోకకళ్యాణం కోసమేనన్నది భక్తుల నమ్మకం. అందుకే శ్రీరామనవమి రోజున భద్రగిరి భక్త జనంతో పోటెత్తుతుంది. లోకకళ్యాణ క్రతువులో తామూ పాలు పంచుకోవాలని తపన పడుతుంటారు లక్షల మంది.

నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న శ్రీరామ కళ్యాణం, 16న పట్టాభిషేకం జరుగుతాయి. ఇందు కోసం ఆహ్వాన పత్రికను ముద్రించారు భద్రాచలం ఆలయ అధికారులు. సీఎంను ఆహ్వానిస్తూ ఇదే పత్రికను పంపాల్సి ఉంది కూడా. అలాంటి ఆహ్వాన పత్రిక విషయంలో అంతులేనంత నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఏప్రిల్‌ 16న శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకం జరుగుతుందని ఆహ్వాన పత్రిక మొదట్లో ఉంది. అంతవరకు ఓకే. కానీ లోపలికెళ్ళేసరికి తేదీ మారిపోయింది. పట్టాభిషేక విశిష్టతను వివరిస్తూ 7వ పేజీలో 29.03.2015న ఆ విశేష కార్యక్రమం జరుగుతుందని రాశారు. అంటే అయిపోయిన పట్టాభిషేకానికి రమ్మని సీఎంను తాజాగా ఆహ్వానించబోతున్నారన్న మాట.

వాస్తవానికి ఇది నిరుడు పట్టాభిషేకం నిర్వహించిన తేదీ. ఏ మాత్రం ఆలోచించకుండా పాతకాపీ తీసి ప్రింటింగ్‌కు ఇచ్చేయడం వల్లే ఇదంతా జరిగింది. పట్టాభిషేక విశిష్టత ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఆ మేటర్‌ను తీసుకునేటప్పుడు తేదీ మార్చాలన్న కనీస స్పృహ లేకుండా చేయడం వల్లే ఈ తప్పు జరిగిపోయింది. పర్యవేక్షణ లోపమే ఇందుకు అసలు కారణం.

ఓ వైపు ఉత్సవాలు ప్రారంభం అయినా…అందుకు తగ్గ ప్రచారం కూడా కనిపించడం లేదు. ఈ నిర్లక్ష్యాన్ని చూస్తుంటే ఈ సారి శ్రీరామనవమి ఏర్పాట్లు ఎలా చేస్తారోనని ఆందోళనగా ఉందంటున్నారు భక్తులు.