15వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో 15 తీర్మానాలకు ప్లాన్‌

ఖమ్మం జిల్లా గులాబీ మయమైంది.. బుధవారం జరిగే టీఆర్‌ఎస్‌ 15వ జన్మదిన వేడుకలకు ఉద్యమాల గడ్డ అందంగా ముస్తాబవుతోంది. నగర సమీపంలో చెరుకూరి గార్డెన్స్‌లో ప్లీనరీని, కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు నుంచి నాలుగు లక్షల మంది సభకు వస్తారని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకను తొలిసారి ఖమ్మంలో నిర్వహిస్తుండడంతో.. అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. ఈ ప్లీనరీని పండగలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ కార్యకర్తలు.. నగరమంతా భారీగా స్వాగత తోరణాలతో చుట్టేశారు. ఎక్కడ చూసినా సీఎం, మంత్రుల ఫ్లెక్సీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల పెయింటింగ్స్‌ను వేయించి నగరాన్ని గులాబీ వనంగా మార్చేశారు.

జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకే ఓ వైపు పాలేరు ఉప ఎన్నికలో పోటీచేస్తున్నా.. అటు ప్రచారంతోపాటు, ఇటు ప్లీనరీ ఏర్పాట్లలో బిజీ అయ్యారు. పార్టీశ్రేణులకు ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పజెప్పి పర్యవేక్షిస్తున్నారు..

చెరుకూరి గార్డెన్స్‌లో నిర్వహించే ప్లీనరీ కోసం రెండువేల చదరపు మీటర్ల ప్రాంగణాన్ని నిర్మించారు. లోపల సీఎం కేసీఆర్, మంత్రివర్గం, ఇతర అతిథులంతా కూర్చునేలా విశాలమైన వేదిక తయారుచేశారు. మధ్యమధ్యలో టీ, కాఫీ, మజ్జిగ, శీతల పానీయాలు, స్నాక్స్, జావ, పకోడి, గారెలు వంటి అల్పాహారాన్ని అందించేందుకు వాలంటీర్లను నియమించారు. అయితే ఎవరైనా సరే పాస్‌లు ఉన్నవారినే లోపలికి పంపించనున్నారు.

మరోవైపు ఎండలు దంచేస్తుండడంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా ఏసీలు, జంబోకూలర్స్‌తోపాటు ఎయిర్ మిక్స్‌తో వాటర్ స్ప్రే యంత్రాలను అమరుస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యేవారికి ఉదయం ఏడు గంటల నుంచి అల్పాహారాన్ని అందించనున్నారు. దాదాపు 30 రకాలకుపైగా వెజ్‌ నాన్‌ వెజ్‌ వంటకాలను రెడీ చేస్తున్నారు. మధ్యమధ్యలో మజ్జిగ, రాగిజొన్న మిక్స్‌డ్ జావ, పళ్ల రసాలను ఇవ్వనున్నారు.

చివరిగా ప్లీనరీలో 15 అంశాలపై తీర్మానం చేయనున్నారు. సంక్షేమం, ఇరిగేషన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్‌బెడ్‌రూం పథకం, వ్యవసాయం లాంటి తదితర అంశాలపై తీర్మానం చేయనున్నారు..