వేములవాడ రాజన్న క్షేత్రానికి మహర్దశ…!

వేములవాడ రాజన్న క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి. ఈ ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూనే పిలిగ్రిమ్ టూరిజం సెంట‌ర్‌గానూ అభివృద్ధి చేయాల‌ని భావిస్తోంది.

వేములవాడ రాజన్నకు రాజయోగం పట్టనుంది. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ ఆలయం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందింది. హైదరాబాద్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పారాణికంగా, చారిత్రకంగానూ విశిష్టతలను సంతరించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆలయాల అభివృద్ధిపై దృష్టిసారించిన ప్రభుత్వం ఇప్పటికే యాదాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పుడు అదే తరహాలో వేములవాడను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

వేములవాడ ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారుల‌తో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్‌లు రూపొందించిన ఆల‌య న‌మునాను మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని వాస్తు దోషాలు లేకుండా, ఆగ‌మ శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలని సూచించారు. టీటీడీ త‌ర‌హాలో భ‌క్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

కేవలం ఆలయ అభివృద్ధిపైనే కాకుండా… పిలిగ్రిమ్ టూరిజంపైనా సర్కారు దృష్టి పెట్టింది. రాజన్నక్షేత్రం చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా అందంగా తీర్చిదిద్దేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రణాళిక అమల్లోకి వస్తే రాజన్నక్షేత్రం త్వరలోనే… ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది.