అరవింద్‌ స్వామికి జోడీగా మిల్కీ బ్యూటీ?

హీరో క‌మ్ విల‌న్ అర‌వింద్ స్వామి స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సొంతం చేసుకుందిట‌. కోలీవుడ్ లో హాట్ టాపిక్ ఇది.

90ల‌లో అర‌వింద్ స్వామి అసాధార‌ణ‌మైన‌ లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో. రోజా, బొంబాయి, మెరుపుక‌ల‌లు వంటి అందమైన ప్రేమ‌క‌థా చిత్రాల్లోన‌టించి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. న‌టించింది కొద్ది సినిమాలే అయినా అన్నీ ట్రెండ్ సెట్టర్స్‌. కెరీర్ తొలి ప్రయ‌త్నమే `రోజా`తో ల‌వర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్ లో కొన్నాళ్ల పాటు అదే దూకుడు కొన‌సాగించారు. అయితే అనూహ్యంగా ఆ త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. ఇటీవ‌లే మ‌ళ్లీ `తని ఒరువ‌న్` సినిమాతో విల‌న్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ విజ‌యం సాధించ‌డంతో అటు కోలీవుడ్‌లో బిజీ స్టార్‌గా మారాడు. తెలుగులోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

అయితే ఈ హీరో క‌మ్ విల‌న్ ఇప్పుడు మ‌ళ్లీ హీరో వేషాల‌కు రెడీ అవుతున్నాడు. గ‌తంలో వ‌చ్చిన `స‌తురంగ వెట్టయ్` సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అర‌వింద్ స్వామినే హీరోగా అనుకుంటున్నారు. ఆయ‌న స‌ర‌స‌న మేటి నాయిక న‌టించినా ప‌క్కాగా యాప్ట్ అవుతుంది. ఇప్పటికీ ఆయ‌న వ‌య‌సు పెరిగిందేమో కానీ.., హీరోయిక్‌ లుక్, ఛామ్‌ మాత్రం అలానే ఉన్నాయి. అందుకే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను హీరోయిన్ గా ఎంపిక చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారుట‌. ఇదే గ‌నుక నిజ‌మైతే మిల్కీకి అంద‌గాడి స‌ర‌స‌న జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే.