“అప్పట్లో ఓకడుండేవాడు” సినిమా రివ్యూ!

ఇంట్రో:
నారా రోహిత్, శ్రీవిష్ణులు ముఖ్యపాత్రల్లో “అయ్యారే” ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించిన చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు”. 90వ దశకంలో చోటు చేసుకొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూడండి!

కథ:
ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) చిన్నప్పుడే ఓ నక్సలైట్ ఎటాక్ లో తల్లిదండ్రులను పోగొట్టుకొని.. అప్పట్నుంచే నక్సలిజంపై ద్వేషం పెంచుకొని, నక్సలైట్లను అంతమొందించడమే కర్తవ్యంగా భావించి పోలీస్ అవుతాడు. చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే పిచ్చితో పెరిగిన రైల్వే రాజుకు (శ్రీవిష్ణు) ఎప్పటికైనా ఇండియా టీం తరపున రంజీ ట్రోఫీ ఆడాలని ఆశ. ఆ కోరికనే ఆశయంగా మార్చుకొనే ఆ దిశగా ముందుకు సాగుతుంటాడు.

ఇలా వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్న ఈ ఇద్దరూ ఒక కారణంగా ఒకర్నొకరు ఢీ కొంటారు. ఏంటా కారణం, ఈ ఇద్దరి మధ్య వైరం ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది, ఒకరిపై ఒకరు పై చేయి సాధించడం కోసం ఎలాంటి దారిని ఎంచుకొన్నారు? వంటి అంశాలకు 90వ దశకంలో చోటు చేసుకొన్న కొన్ని నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని జత చేసి తెరకెక్కించిన చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు”.

ఇంతియాజ్ పాత్రలో డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను తన నటనతో రంజింపజేశాడు. ఒక యువ హీరో అయ్యుండి ఇలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ను అంగీకరించడంతోపాటు సినిమాను నిర్మించడం, తన పాత్ర నిడివి గురించి పట్టించుకోకపోవడం వంటి విషయాలను మెచ్చుకొని తీరాలి. యాక్టివ్ సీన్స్ లో పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు శ్రీవిష్ణు. క్రికెటర్ గా పర్లేదు అనే స్థాయిలో నటించినా గ్యాంగ్ లీడర్ గా మాత్రం అలరించలేకపోయాడు. ముఖ్యంగా తన కుమార్తెను 20 ఏళ్ల తర్వాత కలుసుకొనే సన్నివేశాన్ని తన నటనతో పండించలేకపోయాడు.

తాన్య హోప్ కి తన నాటచాతుర్యం చూపే అవకాశం పెద్దగా లభించలేదు, ఉన్న కొన్ని సన్నివేశాల్లో హీరో కౌగిలిలో ఒదిగిపోవడం మినహా పెద్దగా చేసిందేమీ లేదు. బ్రహ్మాజీకి పాత్రకి డెప్త్ అనేది పెద్దగా లేకపోయినా విట్టల్ సేట్ గా కథలో కీలకపాత్ర పోషించాడు. అలాగే అజయ్, రాజ్యలక్ష్మి, మానస హిమవర్ష, రవివర్మల పాత్రలు చిన్నవే అయినప్పటికీ.. వారి పరిధి మేరకు పర్వాలేదనిపించుకొన్నారు.

సాయికార్తీక్ సమకూర్చిన బాణీల కంటే సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సినిమాల నుంచి కాపీ కొట్టినప్పటికీ.. సన్నివేశంలోని ఎమోషన్ ను హైలైట్ చేయగలిగాడు. నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్లైకామ్ షాట్స్ లో క్రికెట్ ప్లే గ్రౌండ్ సీన్ ను చక్కగా ఎలివేట్ చేశాడు. అయితే నిర్మాణ విలువల కారణంగా కొన్ని సన్నివేశాలను మాత్రం సరిగా పిక్చరైజ్ చేయలేకపోయాడు. అరణ్ మీడియా నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. అందువల్ల 1990 నాటి పరిస్థితులను, ప్రదేశాలను పూర్తి స్థాయిలో రీక్రియేట్ చేయడంలో విఫలమయ్యారు.

దర్శకుడు సాగర్ చంద్ర “అయ్యారే” అనంతరం తెరకెక్కించిన చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు”. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లా కాకుండా ఈ చిత్రాన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేద్దామనుకొన్న ఆలోచన, ఆ ఆలోచన కోసం 1992-1996 నడుమ జరిగిన రాజకీయ, అంతర్జాతీయ అంశాలను గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి సదరు సంఘటనలను కథనంలో ఇన్వాల్వ్ చేయడం వరకూ బాగానే ఉంది కానీ.. వాటి కారణంగా కథను విధవిధాలుగా వంకర్లు తిప్పడమే ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం, రెండు గంటల నిడివిగల సినిమాలో కూడా ల్యాగ్ లు ఉండడం వంటివి పెద్ద మైన్స్ లు.

ఫైనల్ గా చెప్పాలంటే…
క్యారెక్టర్స్ లో ఉన్న పట్టు కథనంలో లోపించిన చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు”.