ఇంట్లో దెయ్యం నాకేం భయం” సినిమా రివ్యూ!

ఈమధ్యకాలంలో టాలెంట్, టైమింగ్, బ్యాగ్రౌండ్ అన్నీ ఉండి కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోలేక వరుస ఫ్లాప్ లతో కథానాయకుల రేస్ లో వెనుకబడ్డ నటుడు అల్లరి నరేష్. “సుడిగాడు” అల్లరి నరేష్ కెరీర్ లో లాస్ట్ హిట్, ఆ తర్వాత నరేష్ నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి బాక్సాఫీసు వద్ద బోల్తాకొడుతూ వచ్చాయి. ఈ ఏడాది చివర్లో అయినా హిట్ కొట్టాలన్న ధృడ నిశ్చయంతో.. తనకు “సీమ శాస్త్రి” లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం “ఇంట్లో దెయ్యం నాకేం భయం”. మరి తుగ్లక్ తరహాలో అల్లరోడు వరుసబెట్టి చేస్తున్న దండయాత్రల తరహాలో చేస్తున్న ఈ తాజా దండయాత్రైనా అతగాడికి సత్ఫలితాన్నిచ్చిందో లేదో చూద్దాం..!!

కథ:
నరేష్ (అల్లరి నరేష్) దెయ్యం అంటే చచ్చేంత భయం కలిగి కూడా పైకి మాత్రం దెయ్యాలు వదిలిస్తానంటూ జనాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజుతూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఒకసారి గోపాల్ (రాజేంద్రప్రసాద్) నరేష్ వద్దకు వచ్చి తన బంగ్లాలో ఉన్న దెయ్యాన్ని వెళ్లగొట్టమని భారీ మొత్తంలో డబ్బు ఆశజూపుతాడు. డబ్బు కోసం కక్కుర్తిపడిన నరేష్ అండ్ టీమ్ ఆ బంగ్లాకు చేరుకొంటారు. ఆ బంగ్లాకు చేరుకొన్న తర్వాత తెలుస్తుంది ఆ దెయ్యం వచ్చింది గోపాల్ కోసం కాదని నరేష్ కోసమని.
అసలు దెయ్యం నరేష్ ను ఎందుకు వెంబడిస్తుంది? అలా వెంబడించడానికి గోపాల్ ఇంటిని ఎందుకు సెలక్ట్ చేసుకొంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే “ఇంట్లో దెయ్యం నాకేం భయం” కథాంశం.

విశ్లేషణ:
భయపడుతూ కామెడీ పండించడం అనే కాన్సెప్ట్ లో ఇన్వాల్వ్ అయిపోయి నటించడం అల్లరి నరేష్ కు కొత్తకాకపోవడంతో ఎప్పట్లానే ఎనర్జీతో పాత్రలోకి దూరిపోయాడు. అయితే.. కథలో, కథనంలోనూ పట్టులేకపోవడంతో అతడు నవ్వించాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. షకలక శంకర్, చమ్మక్ చంద్రలు కామెడీ చేయాలని చేసిన వెకిలి చేష్టలు చిరాకు తెప్పించడం మినహా చేసిందేమీ లేదు. ముఖ్యంగా దెయ్యం దగ్గర టన్నులు తినే సన్నివేశం, క్లైమాక్స్ లో దెయ్యంతో ఆడే ఆటలు థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ను పారిపోయేలా చేస్తాయి.

ఇక హీరోయిన్లు కృతిక, మౌర్యానీలు హీరోకి ముద్దులు పెట్టడానికి, చెరో రెండు పాటల్లో హీరోతో కలిసి డ్యాన్సులు చేస్తూ అంగాంగ ప్రదర్శనలు చేయడం తప్పితే తమ నట విశ్వరూపం చూపడానికి ఆస్కారం లభించలేదు. రాజేంద్రప్రసాద్ సీనియారిటీ ఉన్న బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు. ఇంకా బోలెడు మంది సీనియర్ నటీనటులు వెండితెరను నింపడానికి మినహా పెద్దగా ఉపయోగపడలేదు.

సాయికార్తీక్ సంగీతం చాలా యావరేజ్ గా ఉంది. ఒక్క పాట కూడా గుర్తుపెట్టుకొనే స్థాయిలో లేవు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ లాంటి టెక్నికల్ అంశాలన్నీ చాలా సాధారణంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి ఇంతకంటే ఎక్కువ పెట్టడం వేస్ట్ అనుకొన్నట్లుగా ఉన్నాయి.

దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి ఎప్పుడూ కథ మీద కంటే కథనం మీద కాన్సన్ ట్రేట్ చేసి.. కామెడీతో నెట్టుకొచ్చేస్తుంటాడు. “ఇంట్లో దెయ్యం నాకేం భయం” సినిమాకి కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలనుకొన్నాడు. కానీ.. ఇప్పటికే ఈ తరహా హారర్ కామెడీ సినిమాలను ఈ ఏడాదే ఒక 20కి పైగా చూసేసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా మింగుడుపడదు. ఆ దెయ్యం కమెడియన్లను కుక్కని కొట్టినట్లు కొట్టడాలు, హీరోని నానా ఇబ్బందులు పెట్టడాలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసీ చూసి బేజారెత్తిపోయిన ఉన్న ప్రేక్షకుల సహనానికి పరీక్షే ఈ సినిమా.

ఫైనల్ గా చెప్పాలంటే..
ఈ హారర్ కామెడీలో హారర్ లేదు, కామెడీ అంతకన్నా లేదు!