“పాసింజర్స్” సినిమా రివ్యూ!

జెన్నిఫర్ లారెన్స్, క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్రధారులుగా మోర్టెన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పేస్ డ్రామా “పాసింజర్స్”. ట్రైలర్స్, టీజర్స్ తో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం నేడు (జనవరి 6) విడుదలైంది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం..!!

కథ:
జిమ్ ప్రెస్టోన్ (క్రిస్ ప్రాట్) “అవలాన్” అనే స్టార్ షిప్ లో “హోమ్ స్టెడ్ 2” అనే మరో గ్రహానికి దాదాపు 5000 మంది “పాసింజర్స్”తో సహా పయనమవుతుంటాడు. 120 ఏళ్ల ప్రయాణం కావడంతో అందర్నీ “హైబర్నేషన్” ద్వారా భద్రపరుస్తారు. సరిగ్గా “హోమ్ స్టెడ్ 2″కి చేరుకొనే 44 రోజుల ముందు ఒక టెక్నికల్ ఎర్రర్ కారణంగా 90 ఏళ్ళకు ముందే జిమ్ నిద్రలేస్తాడు. కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న షిప్ లో కనీసం మాట్లాడానికి కూడా ఎవరూ లేకుండా సంవత్సరం పాటు కాలాన్ని వెళ్లదీస్తాడు జిమ్. ఇక ఈ ఒంటరితనాన్ని భరించలేక చనిపోదామనుకొన్నప్పటికీ.. ప్రాణం మీద ఆశ అతడ్ని చనిపోనివ్వదు. తాను ఈ ఒంటరితనం నుంచి బయటపడాలంటే తనకో తోడు అవసరమని గ్రహించిన జిమ్ నిద్రపోతున్న మిగతా పాసింజర్స్ లో నుంచి అరోరా (జెన్నిఫర్ లారెన్స్)ను నిద్రలేపుతాడు. ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారి అంతా సాఫీగా సాగుతుందనుకొంటున్న తరుణంలో.. షిప్ కమాండర్స్ లో ఒకడైన గస్ (లారెన్స్ ఫిష్ బర్నీ) కూడా అదే “టెక్నికల్ ఎర్రర్” కారణంగా నిద్రలేస్తాడు.
గస్ రాకతో ఇదంతా “టెక్నికల్ ఎర్రర్” కారణంగా జరగడం లేదని, షిప్ లో ఏదో ఫాల్ట్ ఉందని తెలుసుకొంటారు. ఆ “టెక్నికల్ ఎర్రర్”ను గస్ సహాయంతో జిమ్-అరోరా ఎలా రెక్టిఫై చేశారు? చివరికి “పాసింజర్స్” అందరూ సురక్షితంగా “హోమ్ స్టెడ్ 2″కి చేరుకోగలిగారా? అనేది “పాసింజర్స్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

విశ్లేషణ:
సినిమా మొత్తం ఒక 15 నిమిషాల మినహా కనిపించేది జెన్నిఫర్ లారెన్స్, క్రిస్ ప్రాట్ లు మాత్రమే. నటీనటులుగా వారి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. కథ మొత్తం భూమికి 30 ఏళ్ల దూరంలో (లైట్ స్పీడ్ ను కాలంతో క్యాల్కులేట్ చేస్తారు) జరుగుతుంటుంది. ఒకట్రెండు సన్నివేశాల్లో మినహా ఎక్కడా కూడా వారు అంతరిక్షంలో తిరుగుతున్నారనేది ప్రేక్షకుడి గుర్తుకురాదు. జెన్నిఫర్ లారెన్స్ అప్పుడప్పుడూ అందాలతో కనివిందు చేస్తూనే తన నటనతో అలరించింది. ఒక ఏడాదిపాటు ఒంటరితనంతోనే కాక వివక్షతోనూ బాధపడుతూ బ్రతకడం కోసం పరితపించే వ్యక్తిగా క్రిస్ ప్రాట్ “జిమ్” పాత్రకు న్యాయం చేశాడు.
ఆండ్రాయిడ్ రోబోగా మైఖేల్ షీన్ నిడివి తక్కువే అయినప్పటికీ.. ఎటువంటి ఫీలింగ్స్ లేని రోబోట్ గా అలరించాడు. చిన్న పాత్రే అయినా కథలో కీలకమైన మలుపు తీసుకువచ్చే కెప్టెన్ గస్ క్యారెక్టర్ లో లారెన్స్ ఫిష్ బర్నీ సినిమాకి మంచి ఇంటెన్సిటీ యాడ్ చేశాడు.

సాధారణంగా “స్పేస్” బేస్డ్ ఎంటర్ టైనర్స్ అంటే టెక్నికల్ గా అద్భుతంగా ఉంటాయి. “గ్రావిటీ” అందుకు నిదర్శనం. సినిమాలోని నటీనటులతోపాటు ప్రేక్షకులు కూడా స్పేస్ ట్రావెల్ చేస్తున్న అనుభూతికి లోనవుతుంటారు. కానీ.. “పాసింజర్స్”లో ఆ తరహా గ్రిప్పింగ్ టెక్నికల్ అంశాలు మిస్ అయ్యాయి. ప్రేక్షకుడ్ని ఎగ్జైట్ చేసే స్థాయిలో సీజీ వర్క్ లేదు. రోడ్రిగో సినిమాటోగ్రఫీ, థామస్ బ్యాగ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ గానే ఉన్నాయి. జాన్ స్పైట్స్ రాసిన కథ ప్రారంభం బాగుంది. ఎన్ని తరాలు మారినా, ఎంత దూరం ప్రయాణం చేసినా మనిషిలోని వివక్ష అనే గుణం మాత్రం అతడ్ని వీడిపోదని కొన్ని సన్నివేశాల ద్వారా ఎలివేట్ చేసిన విధానం, ఒంటరితనం బాధను హీరో పాత్ర ద్వారా ఎలివేట్ చేసిన తీరు కథకుడిగా అతడి ప్రతిభకు నిదర్శనం. అయితే.. కథ మొత్తం ఇద్దరి చుట్టూనే సాగదీయడంతో ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలవుతాడు. అలాగే.. సినిమాను ముగించిన తీరు కూడా అలరించే స్థాయిలో లేదు. దర్శకుడు మోర్టెన్ టైల్డమ్ కథను నడిపించిన తీరు సోసోగా ఉంది. అయితే, హీరోహీరోయిన్ల నడుమ లవ్ స్టోరీని బిల్డ్ చేసిన విధానం మాత్రం అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ ను “ఫక్తు కమర్షియల్ సినిమా” తరహాలో ఎండ్ చేయడం ఆడియన్స్ ను సాటిస్ఫై చేయదు. సాధారణంగా ఈ తరహా సినిమాలకు “సేడ్ ఎండింగ్” ఎక్స్ పెక్ట్ చేసిన ఆడియన్స్ ను “పాసింజర్స్” నిరాశపరుస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే..
టైమ్ పాస్ స్పేస్ డ్రామా “పాసింజర్స్”