కార్ల అమ్మకాల్లో ‘ఆడి’ రికార్డు…

లగ్జరీ కార్ల బ్రాండ్‌లో ఒకటైన ప్రముఖ జర్మనీ కంపెనీ ఆడి 2016 ఏడాదిలో తన కార్ల విక్రయాల్లో రికార్డు సృష్టించింది. ఇతర లగ్జరీ కార్ల కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదురైనా… డీజిల్‌ ఉద్గారాలు స్కామ్‌ అభియోగాలు వచ్చినా కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఫోక్స్ వ్యాగన్ గ్రూపు లగ్జరీకార్లు, స్పోర్ట్స్ యుటిలీటీ కార్ల విక్రయాల్లో భారీ వృద్ధిని సాధించింది.

గత ఏడాది (2015)లో 1.80 మిలియన్ల వాహనాల విక్రయాలతో పోలిస్తే… 2016 డిసెంబర్‌ అమ్మకాల్లో 1.87 మిలియన్ యూనిట్లను సాధించినట్టు కంపెనీ ప్రకటించింది. గ్లోబల్ లగ్జరీ కార్ల బ్రాండ్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయినా అమ్మకాల్లో దూసుకుపోయింది ఆడి. మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూలతో పోలిస్తే ర్యాకింగ్స్ లో రెండు స్థానాలు వెనుకబడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ నెల 9వ తేదీన అధికారికంగా లెక్కల్ని ప్రకటించనుంది ఆడి.