పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు చెల్లవు…!

పెద్దనోట్ల రద్దుతో మొదలైన కరెన్సీ కష్టాల నుంచి బయటపడటానికి, అదే విధంగా నగదు రహిత లావాదేవీల్లో భాగంగా చాలా వరకు ఇప్పుడు డెబిడ్‌, క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు… ఇక కార్డులపై పెట్రోల్‌ పోయించుకునే వారి సంఖ్యా ఎక్కువే… అయితే ఇప్పుడు ప్రజలకు మ‌రో షాక్ ఇవ్వడానికి సిద్ధమ‌వుతున్నాయి పెట్రోల్ బంకులు. దేశ‌వ్యాప్తంగా సోమ‌వారం నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణయం తీసుకుంది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై జరిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని నిర్ణయించడమే పెట్రోలియం ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఆందోళనకు కారణమని తెలుస్తోంది. బ్యాంకులు హఠాత్తుగా అక్రమ నిర్ణయం తీసుకున్నాయని పెట్రోల్ బంకుల య‌జ‌మానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త చార్జీలను బ్యాంకులు వినియోగ‌దారుల‌పై భారం మోపకపోవడంతో ఆ భారమంతా తమపైనే పడబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ బంకుల యాజ‌మానులు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సోమ‌వారం నుంచి కార్డుల‌ను అంగీకరించబోమని… క్యాష్‌ లావాదేవీలకే అంగీకరిస్తామని అఖిల క‌ర్ణాట‌క ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌ం అధ్యక్షుడు బీఆర్ ర‌వీంద్రనాథ్ తెలిపారు.

నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కార్డుల ద్వారా పెట్రోల్ పోయించుకుంటే 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రభుత్వం ప్రకటించడంతో వినియోగదారులు కార్డుల వినియోగం వైపు మొగ్గుచూపుతున్న ఈ తరుణంలో పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాల నిర్ణయం ల‌క్షలాది మంది వినియోగ‌దారుల‌కు తీవ్ర అసౌక‌ర్యం కలగనుంది. మరి పెట్రోల్‌ బంక్‌ యజమానులు మెట్టు దిగుతారా..?… బ్యాంకులు మెట్టు దిగుతాయా…? ఇక ఇద్దరూ కలిసి వినియోగదారుడిపై భారం మోపనున్నారా…? వేచిచూడాలి మరి.