పంజాబ్‌ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్‌…!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరు హాట్‌టాఫిక్‌ అయ్యింది… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాలే ఉంటారన్న అర్థంలో ఆ పార్టీ నేత మనీష్‌ శిసోడియా వ్యాఖ్యానించారు. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ కేజ్రీవాల్ సీఎం కావాలనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు.

అయితే పంజాబ్ ఎన్నికల బరిలోకి సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ బరిలో దిగుతారా? అనే చర్చ రాజకీయ పార్టీల్లో మొదలైంది. ఇప్పటి వరకు ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కేజ్రీవాల్‌ ఢిల్లీ నుంచి పంజాబ్‌ మారే ఆలోచనలో ఉన్నారంటూ రాజకీయవర్గాల్లో టాక్‌. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలిచిన ఆమ్ ఆద్మీ… కాంగ్రెస్, అకాలీదళ్‌కు ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఫిబ్రవరి 4 న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా… మార్చి 11న ఫలితాలు ప్రకటించనున్నారు