తక్కువ వడ్డీకే హోమ్‌ లోన్స్‌…

ప్రధాని నరేంద్ర మోదీ… పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న త‌రువాత బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు జమ కావడంతో క్రమంగా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి… ఇప్పటికే పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గృహరుణ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఇప్పటికే అతితక్కువ వడ్డీ రేటుకే హోమ్‌ లోన్స్‌ ఇస్తున్న ఎస్‌బీఐ కంటే చౌక వడ్డీరేట్లలో రుణాలు ఇస్తామని తెలిపింది. హోమ్‌ లోన్స్‌పై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.50 శాతం వడ్డీని వసూలు చేస్తుండగా… 8.35 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు ఇస్తామని తెలిపింది బ్యాంక్ ఆఫ్ బ‌రోడా. రుణం ఇచ్చే ముందు ఖాతాదారుడి గ‌త రుణ వివ‌రాల‌ చెల్లింపుల ఆధారంగా లెక్కగట్టే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉన్న కస్టమర్లకే ఈ వడ్డీరేట్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.