మెగాస్టార్‌పై ప్ర‌ముఖుల‌ కొటేష‌న్స్‌…

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ సినిమా ‘ఖైదీనంబ‌ర్ 150′ రిలీజ్ సంద‌ర్భంగా చిరు గురించి కొంద‌రు ప్ర‌ముఖులు ఇచ్చిన కొటేష‌న్స్ ఓ మారు గుర్తు చేసుకుంటే చిరు స్వ‌యంకృషి ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది.

*చిరంజీవి అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేవి ఆయ‌న చేసే నృత్యాలు. ఆయ‌న చేసే పోరాటాలు. ఆయ‌న చేస్తున్న నృత్యాలు చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయిన సంద‌ర్భాలున్నాయి. ఆయ‌న త‌న శ‌రీరాన్ని య‌థేచ్ఛ‌గా వంక‌ర‌లు తిప్పుతూ, ఎటుబ‌డితే అటు వంగుతూ చేసే డ్యాన్సులు చూసిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న ఒంట్లో ఎముక‌లే లేవేమో అనిపిస్తుంది. చిరంజీవి డ్యాన్సుల‌కు నేను అభిమానిని. ఫైట్స్‌లోనూ కొత్త ఒర‌వ‌డి సృష్టించిన హీరో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అత‌డి త‌త్వం అన్నా నాకు ముచ్చ‌టేస్తుంది.
-కీ.శే.డా.అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.

*చిరంజీవి చాలా అంద‌గాడు. క‌ళ్లు ఆయ‌న‌లోని ప్ర‌త్యేక‌త‌. ఆ విల‌క్ష‌ణ‌మైన క‌ళ్ల‌తోనే ఈ లోకాన్ని ఏలారు. ప్రేక్ష‌కుల క‌ళ్ల‌ను త‌న‌వైపు తిప్పేసుకుని స్టారాధిస్టార్‌గా ఆవిర్భ‌వించారు. ఆయ‌న ఫైట్లు, డ్యాన్సులు నాకు చాలా ఇష్టం
-కీ.శే. బాపు(ద‌ర్శ‌కుడు)

*చిరంజీవిలో అపార‌మైన శ‌క్తి ఉంది. దానికి తోడు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వం ఉంది. ఆ ల‌క్ష‌ణాలే త‌న‌ని పెద్ద న‌టుడిని చేశాయి. పాత్రోచిత్యానికి అనుగుణంగా త‌న‌ని తాను మ‌లుచుకోగ‌లిగే గొప్ప ప్ర‌తిభాశాలి- కీ.శే.కె.బాల‌చంద‌ర్ (ద‌ర్శ‌కుడు)

*’ఖైదీ’ (1983) సినిమాలో చిరంజీవి క‌థ‌ను అర్థం చేసుకుని క‌దం తొక్కాడు. ఆయ‌న వంటి యాక్ష‌న్ హీరో మ‌రొక‌రు లేరు. దుస్తులు న‌ల‌గ‌ని హీరోయిజం పోయి, రాటు దేలిన హీరోయిజం ఖైదీలో చూపించారు. ఖైదీనంబ‌ర్ 150లోనూ అంతే ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తార‌న‌డంలో సందేహం లేదు- ఎ.కోదండ రామిరెడ్డి (ద‌ర్శ‌కుడు)

*చిరంజీవి యాక్ష‌న్ సీన్ల‌ను ఎంత‌గా ర‌క్తి క‌ట్టిస్తారో సెంటిమెంటు సీన్ల‌లో అంతే స్థాయిలో కంట‌త‌డి పెట్టిస్తారు- విజ‌య బాపినీడు (ద‌ర్శ‌క‌నిర్మాత‌)

*మోస‌గాడుకు .. ఘ‌రానా మొగుడుకు స్టార్‌గా మెగాస్టార్ స్థాయి మారింది కానీ, కృషి- ప‌ట్టుద‌ల మార‌లేదు. ఇప్ప‌టికీ అదే ప‌ట్టుద‌ల కనిపిస్తోంది- కె.రాఘ‌వేంద్ర‌రావు.

*క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల చిరంజీవిని ఈ స్థాయికి తెచ్చాయి. త‌న‌లో న‌టుడిని తుదికంటా కాపాడుకున్న గొప్ప స్టార్ ఆయ‌న‌- కె.విశ్వ‌నాథ్ (ద‌ర్శ‌కుడు)

*చిరంజీవి గురి ఎప్పుడూ ల‌క్ష్యం మీదే. దాని మీద‌కు ఓ వేట‌గాడి స్ఫూర్తితో దూసుకెళ‌తారు. ‘ఖైదీనంబ‌ర్ 150’ కోసం అంత‌గానే శ్ర‌మించారు. ప్రేక్ష‌కాభిమానుల‌కు త‌ను ఇస్తున్న‌ ఓ వెల్ ట్రీట్ ఈ చిత్రం. – అల్లు అర‌వింద్ (నిర్మాత‌)

*చిన్న మార్పు చేర్పుల‌తో స‌న్నివేశానికి అప్ప‌టిక‌ప్పుడు మెరుగులు దిద్ద‌డంలో చిరంజీవికి సాటి లేరు. అవి జ‌నాన్ని బాగా ఆక‌ర్షిస్తాయి. బాస్ ఈజ్ బ్యాక్‌. ‘ఖైదీనంబ‌ర్ 150’తో మ‌రోసారి సంచ‌ల‌నాలు ఖాయం- సి.అశ్వ‌నీద‌త్ (నిర్మాత‌)

*ప‌వ‌ర్‌స్టార్‌కి మెగాస్టార్ ఓ ఇన్‌స్పిరేష‌న్‌. చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌, శిరీష్ ఇంత‌మంది ఆ కుటుంబం నుంచి వ‌చ్చిన స్టార్ల‌కు మెగాస్టార్ ఇన్‌స్పిరేష‌న్ – టి.సుబ్బ‌రామిరెడ్డి (క‌ళాబంధు, నిర్మాత‌)

*చిరంజీవి సినిమా చూసిన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చిరు ‘ఇరగదీశాడు రా’ అంటారు. దాదాపు ఏనిమిది ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ నటించడం చరిత్రలో మొదటిసారి. ఎప్పుడు మేకప్‌ వేసుకుంటారా? ఎప్పుడు కథను ఫైనలైజ్‌ చేస్తారా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూసిన అభిమానులకు సమాధానం ‘ఖైదీ నంబర్‌ 150’. కేవలం కృషి, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. ‘ఖైదీ’ కోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తుంటే జనం చూస్తారా? డ్యాన్స్‌ చేస్తాడా? ఫైట్స్‌ చేస్తాడా? అనుకున్న వారందరికీ ఇదే సమాధానం. చిరంజీవి 25ఏళ్లు కుర్రాడిగా కనిపించబోతున్నారు అంటే ఏడాదిగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఈ సినిమా బిగినింగ్‌లో ఓ పాటను చూశా. ఆ పాట చూసిన తర్వాత నటించింది చిరంజీవా.. రామ్‌చరణా.. అల్లు అర్జునా.. అనిపించింది. వారు కూడా సరిపోరు అంటారు మీరు.
-ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు

*ఏ ఇంట్లో పెద్ద కొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బావుంటుంది అని అన్న‌య్య(ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు) చెబుతారు. ఈ ఇంట్లో చిరంజీవిగారు పెద్ద కొడుకు. ఆయ‌న అండ‌తోనే మెగా ఫ్యామిలీలో స్టార్లు పుట్టుకొచ్చారు. ఇంత‌మందిని క‌ళాసేవ‌కు అంకిత‌మిచ్చారు మెగాస్టార్‌. ఆయ‌న న‌టించిన‌ ‘ఖైదీనంబ‌ర్ 150’ రిలీజ్‌కి ముందే పండుగ వ‌చ్చేసింది. చిరుతో మా అనుబంధం ఎన్న‌టికీ విడ‌దీయ‌లేనిది. రైతుకు దున్న‌డ‌మే కాదు .. త‌న్న‌డం కూడా తెలుసు.. అనే డైలాగ్ నుంచి ఎన్నో ఆస‌క్తి క‌లిగించే డైలాగ్స్ ఉంటాయి.
-ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌

* చిరంజీవి క‌ష్ట‌జీవి. రైతు కుటుంబం నుంచి స్వ‌శ‌క్తితో పైకి ఎదిగారు. మేం కూడా అదే త‌ర‌హాలో రైతు కుటుంబం నుంచి వ‌చ్చి ఎదిగాం. ప్ర‌జాసేవ చేయ‌డానికి వెళ్లినా.. క‌ళాసేవ కూడా ప్ర‌జాసేవే అని మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చారు చిరు. ‘ఖైదీనంబ‌ర్ 150’తో ప్రేక్ష‌కాభిమానుల్ని అల‌రించేందుకు వ‌చ్చారు.
– ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు

*అన్న‌య్య న‌న్ను ఓ స‌రైన దారిలో తీర్చిదిద్దారు. నాన్న‌గారి త‌ర్వాత‌.. నాన్న‌గారు లేని లోటు పెద్ద‌న్న‌య్య రూపంలో మెగాస్టార్ తీర్చారు.
-వి.వి.వినాయ‌క్‌

*సేవ‌కు చిరు ఓ నిర్వ‌చ‌నం వంటివారు. హృద‌య స్పంద‌న‌తో చేసేది ఏదైనా స‌మాజ సేవే అని న‌మ్ముతారు. రూ.3 కోట్ల పైచిలుకు వ్య‌యంతో తాను నెల‌కొల్పిన ర‌క్త‌, నేత్ర నిదికి నెల‌నెలా అయ్యే నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని చిరంజీవి స్వ‌యంగా భ‌రిస్తున్నారు. చిరంజీవి నేత్ర‌, ర‌క్త‌నిధి వ‌రుస‌గా కొన్ని ఏళ్ల పాటు ఉత్త‌మ స్వ‌చ్ఛంద సేవా ర‌క్త‌నిధిగా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అవార్డులు అందుకుంది.

*న‌ట‌న‌, ప్ర‌వ‌ర్త‌న‌, ప‌రివ‌ర్త‌న ఓ వ్య‌క్తిని స్టార్‌గా ఆవిష్క‌రిస్తాయి. భిన్న వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మ‌న‌సుల్ని గెలుచుకునే వ్య‌క్తిత్వంతో ఆకాశం ఎత్తు ఎదిగిన ఒక వ్య‌క్తి చిరంజీవి.