ఆ డిపాజిట్లపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి…

అవినీతి, బ్లాక్‌మనీని అరికట్టడమే లక్ష్యంగా నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత… ఓల్డ్‌ కరెన్సీని మార్చుకోవడానికి ఇచ్చిన 50 రోజుల గడువులో బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్లపై ఆదాయపన్ను శాఖ దృష్టి పెట్టింది. వీటిలో ముఖ్యంగా రూ.2 లక్షల రూపాయలకు పైగా డిపాజిట్లు, వాడకంలోలేని ఖాతాల్లో జమలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఐటీశాఖ.

ఇక రూ.2 లక్షలకు పైగా నగదు దాదాపు 60 లక్షలకు పైగా ఖాతాల్లో జమ అయినట్టు గుర్తించింది ఐటీ శాఖ… వీటిలో ఎక్కవగా రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయక ముందు వాడకంలో లేని ఖాతాలే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు ట్యాక్స్‌ ఎగవేసినట్టు తేల్చేశారు. వీటిలో రూ.10,700 కోట్లు ఈశాన్య రాష్ర్టాల్లోని బ్యాంకుల్లో జమ అయినట్టు… నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 30 మధ్య రూ.25వేల కోట్లు డిపాజిట్‌ అయినట్లు గుర్తించారు.

ఈ కాలంలో రూ.80వేల కోట్ల రుణాలను చెల్లించినట్లు గుర్తించారు. ఇక సహకార బ్యాంకుల్లోని ఖాతాల్లోనూ రూ.16వేల కోట్లు జమ అయినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల బ్రాంచిల్లోనూ నగదు లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీశాఖ… ఎక్కువ మొత్తాలు జమ అయిన ఖాతాలే టార్గెట్‌గా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమైంది.