ఢిల్లీలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం…!

ఫారన్‌ టూర్‌ పూర్తి చేసుకుని వచ్చిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు.. పార్టీ వ్యవహారాలపై తిరిగి దృష్టిసారించారు. కీలక రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరుగుతుండడంతో.. కిందిస్ధాయి నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ఓట్లుగా మార్చుకోవాలని భావిస్తున్న రాహుల్‌.. ‘జన వేదన్‌’ పేరుతో బుధవారం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

పెద్దనోట్ల రద్దుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్‌.. మరో భారీ కార్యక్రమానికి సమాయత్తమయింది. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘జన్‌ వేదన్‌’ పేరుతో తొలిసారి ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. రాహుల్‌ గాంధీ నేతృత్వం వహిస్తున్న ఈ సదస్సులో పెద్దనోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, దేశ ఆర్ధిక వృద్ధికి కలిగిన విఘాతంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

ఢిల్లీలో జరుగుతున్న ఈ విస్తృత సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు జిల్లా, మండల స్థాయి అధ్యక్షులు, గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఏఐసీసీ సభ్యులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నారు. రాహుల్‌ గాంధీ స్వయంగా ఎంపిక చేసిన రెండు వందలమంది సమన్వయకర్తలు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులు, ప్రజల ఆందోళనలు పరిశీలించారు. వాటిని ఈ సమావేశంలో నివేదికల రూపంలో అందించనున్నారు. అలాగే పెద్దనోట్ల రద్దుతో ఎదురైన ఇబ్బందులపై మాట్లాడేందుకు వివిధ రాష్ట్రాలనుండి హాజరయ్యే నేతలకు అవకాశం ఇస్తారు.

దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దువల్ల కలగిన ఇబ్బందులను సమిష్టిగా చర్చించి సమీక్షించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సమావేశం ఖరారు చేయనుంది. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు త్వరలో చేపట్టనున్నారని వార్తలు వస్తున్న క్రమంలో ఆయన నేతృత్వంలో ఏర్పాటైన ఈ సదస్సుపై ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.