మావ‌య్య‌పై మెగా మేన‌ల్లుడేమ‌న్నారు?

సాయిధరమ్‌తేజ్ రైజింగ్ మెగా యువ హీరో. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడైనా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నహీరో త‌ను. ఇటు కామెడీ అటు ఫ్యామిలీ హీరోగా ఫ్యామిలీ ప్రేక్షకులకు, మాస్‌ ఆడియెన్స్‌కు సాయిధరమ్‌తేజ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సాయిధరమ్‌తేజ్‌కు సంబంధించిన విశేషం ఏమంటే మిడ్‌షాట్‌లో కాని, లాంగ్‌షాట్‌లో కాని పెద్ద మామయ్యలానే మనకు కనిపిస్తాడు! ఆ విధంగా సాయి మావయ్యను పుణికి పుచ్చుకున్నాడు.. ఇప్పుడు మావయ్య 150వ సినిమా `ఖైదీనంబర్ 150` గురించి సాగిన ముచ్చట్లు ఇలా సాగాయి…

*మావ‌య్య‌తో చిన్న‌ప్ప‌టి అనుబంధం?
నా స్కూల్‌ డేస్‌ నుంచి డిగ్రీ అయ్యేంత వరకు మొత్తం పెద్ద మావయ్య చిరంజీవి గారే చూసుకున్నారు! చిన్నప్పట్నుంచి ఆయన అన్ని విధాలా సపోర్ట్‌నిచ్చారు. నా చైల్డ్‌ హుడ్‌ అంతా మామయ్య దగ్గరే జరిగింది. ఆ విధంగా పెద్ద మావయ్యతో నాకెంతో అనుబంధం ఏర్పడింది! చిరంజీవిగారు మాత్రమే గాక నాగబాబు మావయ్య, కల్యాణ్‌ మావయ్య అందరూ నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఆ కుటుంబంలోని అందరితోనూ నేను ప్రేమాప్యాయతలను పొందగలిగాను. అది నా అదృష్టం!

* పెద్ద మావయ్య సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా?
మామయ్య నటించిన 149 సినిమాల్లో నాకు నచ్చిన సినిమా చాలానే ఉన్నాయి. అయితే వాటిలో నా మనసుకు బాగా హత్తుకున్న సినిమా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’!

* అందులోని శ్రీదేవి అందచందాలు బాగా హత్తుకున్నాయా?
అప్పటికి నాది చాలా చిన్న వయస్సండీ బాబు! ఎందుకో అందులో మావయ్య నాకు మాంచి ధీరోదాత్తంగా కనిపించారు! మావయ్య గెటప్‌ కూడా వెరైటీ ఉంటుంది! మీరన్నట్టు శ్రీదేవి కూడా నచ్చిందనుకోండి! ఇంకా మావయ్య భలేగా నటించిన ‘చంటబ్బాయ్‌’ చిత్రం కూడా నాకు బాగా ఇష్టం! మావయ్య కామెడీ బాగా చేస్తారు. చంటబ్బాయ్‌ చిత్రంలో ఆయన చేసిన కామెడీ నన్నెంతో ఆకట్టుకుంది.

* చిరంజీవి గారిలో మీకు నచ్చిన అంశం?
మానవతా దృక్పథం. అన్నిటికీ మించి ఆయన మంచి స్నేహశీలి. అందరినీ ప్రేమగా పలుకరిస్తారు. ప్రేమగా చూస్తారు. ఇవన్నీ నాకు నచ్చిన గుణాలు. ఇక నటుడిగా అంటే.. మావయ్యే నాకు ఆదర్శం!’

* చిరంజీవి గారు మిమ్మల్ని ఎప్పుడైనా కోప్పడిన సందర్భం ఉందా?
ఒకే ఒక్కసారండి! టెన్త్‌ క్లాస్‌లో కాబోలు మార్కులు తక్కువ వచ్చాయని కోప్పడ్డారు. అంతే. మళ్లీ ఎప్పుడూ ఆయన కోప్పడలేదు.

* మావయ్య చేసిన సినిమాల్లో ఏదైనా మీరు చేయాలనుకుంటే?
చంటబ్బాయ్‌, ఛాలెంజ్‌ చిత్రాలు. ఆర్టిస్టుగా ఈ రెండు చిత్రాలంటే నాకెంతో ఇష్టం!’ ఈ రెండూ పూర్తిగా విభిన్నమైన చిత్రాలు. ఒకటి కామెడీ, రెండోది సీరియస్‌.

*చిరంజీవి గారితో ఎప్పుడు కలిసి నటిస్తారు?
నటించాలన్న కోరిక నాకు బలంగా ఉంది. అసలు మావయ్య 150 సినిమాలోనే నటించే అవకాశం లభిస్తుందనుకున్నాను. కానీ అవకాశం రాలేదు. అయితే తప్పనిసరిగా ఆ అవకాశం లభిస్తుందనే ఆశతో ఉన్నాను.

* సినిమాలకు సంబంధించి మావయ్య సలహాలు ఇస్తుంటారా?
‘సినిమాలకు సంబంధించి సలహాలు ఇవ్వలేదు కాని, నేను ఆర్టిస్టు నయ్యాక ‘నిర్మాతలను బాగా చూసుకో, డైరెక్టర్స్‌ను గౌరవించు, ఫ్యాన్స్‌ పట్ల శద్ధ్రగా ఉండు’ అని చెప్పారు. ఆ మాటలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాను. నా సినిమాలను చూసి బాగా ఎంజాయ్‌ చేశారు తప్ప ప్రత్యేకంగా సినిమాల మంచి చెడుల గురించి చర్చించలేదు. అయితే నా మొదటి సినిమాను, సుప్రీమ్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ చిత్రాలు చూసి బాగున్నాయి, నువ్వు బాగా చేశావు అన్నారు. ఆ మాటలు నాకు సంతోషాన్నిచ్చాయి.

* చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకునే చిత్రరంగానికి వచ్చారా?
అసలు నాకు సినిమాల్లోకి రావాలని లేదు. అనుకోకుండా చిత్రరంగానికి వచ్చానంతే! నేను సినిమాల్లోకి రాకముందు నుంచే మావయ్య నాకు స్ఫూర్తి ప్రదాత. నేను ఏం చేసినా ఆయనే నాకు స్ఫూర్తి”