కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మెపై ఉత్కంఠ…!

తెలంగాణలో ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ లెక్చరర్లు వెనక్కి తగ్గుతారా? ప్రభుత్వం పెట్టిన డెడ్‌లైన్‌ లోపు విధుల్లో చేరుతారా? ప్రభుత్వం అలోచన ఏంటి? కాంట్రాక్టు లెక్చరర్ల మాటేమిటి?.

తెలంగాణలో పలు డిమాండ్‌లతో జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు అందోళబాట పట్టారు. కనీస వేతన విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 50 శాతం వేతనాలు పెంచేందుకు జీవో తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే డిమాండ్‌లపై సానుకూల ప్రకటన లేకుండా అందోళన ఏలా విరమిస్తామని కాంట్రాక్టు లెక్చరర్లు చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే… అందోళన విరమించడంపై ఆలోచిస్తామని అంటున్నారు.

డెడ్‌లైన్ లోపు జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు విధుల్లో చేరకపోతే చర్యలు చేపట్టేందుకు సర్కార్‌ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. గురువారంలోగా విధుల్లోకి చేరని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబందించిన కసరత్తు కూడా విద్యాశాఖా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రూల్స్ ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజేషన్‌కు అనర్హులవుతారు. పరీక్షలు ముంచుకొస్తున్న వేళ… కాంట్రాక్ట్‌ లెక్చరర్ల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో వారు దూకుడుగా ముందుకు వెళ్తారా? లేక వెనక్కి తగ్గుతారా అన్నది తేలాల్సి ఉంది.