‘ఖైదీ నంబర్ 150’ సినిమా రివ్యూ…

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ళ విరామం అనంతరం పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా.., వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మెగా అభిమానులే కాక తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ వారిని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ:
కత్తి శీను (చిరంజీవి) దొంగతనాలు, లూటీలు చేస్తూ జనజీవనం కంటే జైలు జీవితాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తుంటాడు. ఒకానొక సందర్భంలో శీనుకు కలకత్తా జైలు నుంచి పారిపోయే అవకాశం లభిస్తుంది, ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతోపాటు, అనుకోకుండా తనకు తారసపడిన కె.శంకర్ (చిరంజీవి)ని తన స్థానంలో జైలుకు పంపి తానే శంకర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకొంటాడు శీను.

కట్ చేస్తే.., శంకర్ ఒక మామూలు వ్యక్తి కాదని, లక్షల కోట్ల నల్లధనం నీడన వ్యాపారాలు కొనసాగిస్తున్న బడా కార్పొరేట్ లతో ఒంటరి పోరాటం చేస్తున్న అసాధారణ వ్యక్తని తెలుసుకొన్న శీను తన స్వభావాన్ని మార్చుకొని శంకర్ చేయాలనుకొన్న యుద్ధాన్ని తనదైన మార్గంలో చేస్తూ, నీరూరు గ్రామం భూములు కార్పొరేట్ దిగ్గజం అగర్వాల్ (తరుణ్ అరోరా)కు దక్కకుండా కాపాడుకొంటుంటాడు. ఈ క్రమంలో శీను ఎదుర్కొన్న సమస్యలేమిటి, శీను స్థానంలో కలకత్తా జైల్లో ఉన్న శంకర్ పరిస్థితి ఏమయ్యింది? అనే ప్రశ్నలకు సమాధానరూపంగా తెరకెక్కిన చిత్రమే ‘ఖైదీ నంబర్ 150’.

విశ్లేషణ:
60ఏళ్ల వయసులో కూడా చిరు తన డ్యాన్సులు, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు. ‘అమ్మడు కుమ్ముడు’లో చరణ్‌తో కలిసి చిరు వేసే స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలాగే “రత్తాలు, సుందరి” పాటల్లో గ్రేస్ మూమెంట్స్‌తో అభిమానులను విశేషంగా అలరించాడు మెగాస్టార్. ఇక ఎమోషనల్ సీన్స్ లో కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించిన తీరు ఆయన సీనియారిటీకి నిదర్శనం. కాజల్‌కి కథానాయికగా సినిమాలో పెద్దగా నిడివి లభించలేదు. కనిపించినంతలో అందాలతో కనువిందు చేసింది. చిరంజీవి సరసన ఎలా ఉంటుందో అనుకొన్న వాళ్ళందరూ ‘భలే ఉంది జోడీ’ అనుకొనేలా ఉన్నారిద్దరూ.

ప్రతినాయక పాత్ర పోషించిన తరుణ్ అరోరా ఈ సినిమాకి కొంత మైనస్‌గా మారాడు. హావభావాల్లో విలనిజాన్ని పండించడం కోసం చేసిన ప్రయత్నం కొంతమేరకు ఫలించినప్పటికీ చాలా చోట్ల లిప్ సింక్ కుదరక, ఇంకొన్ని చోట్ల సన్నివేశంలోని ఎమోషన్‌ను ఎలివేట్ చేయలేక చాలా ఇబ్బందిపడ్డాడు, ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టాడు. అలీ పర్వాలేదనిపించాడు, బ్రహ్మానందం-రఘుబాబుల కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ఫస్టాఫ్ లో కాస్త నవ్వించాయి. ఇక పోసాని-అదుర్స్ రఘుల కామెడీ ఎపిసోడ్ ఒక రెండు నిమిషాల వరకూ బాగానే ఉన్నా.., మరీ ఎక్కువగా సాగదీయడంతో బోర్ కొట్టింది.

రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమా మెయిన్ హైలైట్. 60 ఏళ్ల చిరంజీవి వయసు ఓ 20 ఏళ్ళు తగ్గించి 40 ఏళ్లనాటి చిరంజీవిగా తెరపై చూపించిన విధానం మెగా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంది. చిరంజీవి ఎంట్రీ సీన్స్, ఫైట్ సీక్వెన్స్‌లలో వాడిన స్లో మోషన్ షాట్స్ లో చిరంజీవిని చూసి విజిల్ వేయని అభిమాని ఉండడేమో. దేవిశ్రీప్రసాద్ బాణీలు బాగున్నాయి. ముఖ్యంగా.., ‘అమ్మడు కుమ్ముడు, రత్తాలు’ సాంగ్స్‌ను ప్రేక్షకులు థియేటర్లో పాడడం ఆ పాటలు ప్రేక్షకుల గుండెల్లో ఏ స్థాయిలో చొచ్చుకుపోయాయో తెలియజేస్తుంది. సాయిమాధవ్ బుర్రా-వేమారెడ్డి సంయుక్తంగా సమకూర్చిన సంభాషణలు ఆలోచింపజేయడంతోపాటు అలరించాయి. ముఖ్యంగా సింగిల్ లైన్ పంచస్ మాస్ ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. రామ్ చరణ్ నిర్మాణ విలువలు సినిమాకి మరింత వేల్యూను యాడ్ చేశాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.

దర్శకుడిగా వినాయక్ తమిళ ‘కత్తి’ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కన్వర్ట్ చేసిన విధానం బాగుంది. అయితే క్లైమాక్స్ చేసిన మార్పులను మాత్రం అంగీకరించడానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. మొత్తానికి చిరంజీవిలోని కామెడీ టైమింగ్‌ను, ఆయన డ్యాన్స్‌లోని గ్రేస్ ను చక్కగా వినియోగించుకొన్నాడు వినాయక్. వినాయక్ తప్పితే చిరంజీవిని ఈ స్థాయిలో ఎవరూ చూపించలేరేమో అన్నట్లుగా చిరు క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసిన విధానం అభినందనీయం. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో సగటు ప్రేక్షకులను కాక కేవలం మెగా అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించడం వల్ల సినిమాలో లూప్ హోల్స్ ఎక్కువయ్యాయి.

ఫైనల్ గా చెప్పాలంటే…
“బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్”…