బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దపీట వేయాలి…

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌… కేంద్ర మంత్రి స్మృతీఇరానీతో సమావేశమయ్యారు. తెలంగాణ వేదికగా జాతీయ జౌళి సమ్మేళనం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు కేటీఆర్‌. ఈ సమ్మేళనంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సానుకూలంగా ప్రకటన చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు మద్దతు ఇవ్వాలని కోరామన్నారు.

వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు వాడాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్మృతీఇరానీ అభినందించారు… కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా చేనేత వస్త్రాలు వాడాలన్న ఆలోచన చేస్తోందని తెలిపారు కేటీఆర్‌. సిరిసిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు నిధులు కేటాయించేలా ఆర్థిక శాఖకు సూచించాలని కోరామన్నారు మంత్రి కేటీఆర్‌.

తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, అనంత్ గీతే, స్మృతీఇరానీలతోపాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావస, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమయ్యారు కేటీఆర్‌… రానున్న బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్ద పీట వేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని కోరామని తెలిపారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతిఆయోగ్ సూచించిన దాదాపు రూ.20 వేల కోట్లు ఈ బడ్జెట్ లో విడుదల అయ్యేలా చూడాలని కోరామన్నారు.