ప్రజలను ఆకర్షించినవాడే బాహుబలి…

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బాహుబలిపై చర్చ సాగుతోనే ఉంది… బాహుబలి మా పార్టీలో ఉన్నారంటే… లేదు మా పార్టీలోనే ఉన్నారంటూ అధికార ప్రతిపక్ష నేతలు వాదనలకు దిగుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ స్పందించారు. ఎవరు ప్రజలను ఆకర్షిస్తారో వాళ్లే బాహుబలి అని పేర్కొన్న వీహెచ్‌… కాంగ్రెస్‌ పార్టీలో చాలా మంది బాహుబలిలు ఉన్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ల కంటే… కేటీఆర్‌ ఎక్కువ ధీమాగా మాట్లాడుతున్నారని విమర్శించారు వీహెచ్‌.

అసెంబ్లీ మాటలు వేరుగా ఉన్నాయి… క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు వేరుగా ఉన్నాయన్నారు వీహెచ్‌… నీళ్లు రావటం లేదు… వచ్చి కొద్దిపాటి తాగేనీటిలో డ్రైనేజీ కలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు వీహెచ్‌. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అన్ని మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించాలని… సభలు నిర్వహించాలని పీసీసీ చీఫ్‌కు లేఖ రాశానని తెలిపారు వీహెచ్‌. ప్రజల పక్షాన ముందుకు పోవాలని ఆయన సూచించారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన రైతు రుణమాఫీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్‌…. నరేంద్ర మోదీ… యూపీకే మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు కేంద్ర ప్రభుత్వానికి కనబడడంలేదా అని ప్రశ్నించిన వీహెచ్‌… ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీ చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.