ప్రశాంత్‌ కిషోర్‌పై రూ.5 లక్షల నజరానా…!

ప్రశాంత్‌ కిషోర్‌… ఈ పేరు వినగానే కేరాఫ్‌ విన్‌గా భావిస్తారు… నరేంద్ర మోదీ విజయం వెనుక కీలక భూమికి పోషించిన ప్రశాంత్‌ కిషోర్‌… ఆ తర్వాత మోదీ హవా నడుస్తున్న సమయంలోనూ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ కుమార్‌ను గద్దెనెక్కించారు. అయితే తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆయనకు అపకీర్తిని తెచ్చిపెట్టాయి. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందే కిషోర్‌కు… ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్‌… పంజాబ్‌లో విజయం సాధించగా ఉత్తరాఖండ్‌, యూపీలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది… దీంతో ప్రశాంత్‌ కిషోర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు.

ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు… దీంతో ఈ ఓట‌మికి పార్టీ వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్‌ను నిందిస్తున్నారు. ల‌క్నోలోని పార్టీ కార్యాలయంలో ప్రశాంత్‌ కిషోర్‌ క‌నిపించ‌డం లేదంటూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు… అంతటితో ఆగకుండా… ఆయన ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల న‌జ‌రానా ఇస్తామంటూ ఆ హోర్డింగ్‌పై రాశారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న రాజేష్‌సింగ్ అనే వ్యక్తి ఈ హోర్డింగ్‌ను పెట్టించడమే కాకుండా… హోర్డింగ్‌లో త‌న ఫొటోను కూడా ముద్రించారు. దీనితో షాక్‌తిన్న కాంగ్రెస్‌ నేతలు రాజేష్‌సింగ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు రాజేష్ సింగ్. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇన్ని త‌క్కువ సీట్లు రాలేదని సింగ్‌… ప్రశాంత్ కిషోర్ మ‌మ్మల్ని న‌డిపించారు… మేం నిజాయితీ గ‌ల పార్టీ కార్యక‌ర్తలుగా… పార్టీ కోసం ర‌క్తం, చెమ‌ట ధార‌పోశాం. అయినా ఎన్నిక‌ల్లో మా అభిప్రాయాల‌ను పట్టించుకోలేదని ఆరోపించాడు రాజేష్‌సింగ్‌… ఇలాంటి క‌న్సల్టెంట్ల‌ను కిరాయికి తెచ్చుకోవ‌డంతోనే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని రాజేష్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యూపీ, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయినా పంజాబ్‌లో ఘన విజయాన్ని సాధించింది… అయితే మా విజయంలో ప్రశాంత్ కిషోర్‌ది కీల‌క‌పాత్ర అని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ చెప్పడం గ‌మ‌నార్హం. ఏదేమైనా తన వ్యూహాలతో విజయాలను అదించిపెట్టే ప్రశాంత్‌ కిషోర్‌కు ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం షాకిచ్చాయి.