మరో సంచలనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన జియో

సంచలనమైన ఆఫర్లతో టెలికం రంగ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకున్న రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత మంత్రంతో టెలికం రంగంలో విశేషాదరణ పొందిన జియో ఇప్పుడు డీటీహెచ్ రంగంలోకి అడుగుపెట్టనుంది. దీనికోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది రిలయన్స్ యాజమాన్యం. రిలయన్స్ జియో డీటీహెచ్ సర్వీసులను ఈ ఏడాది మే నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో… డీటీహెచ్ సర్వీసుల్లోనూ దుమ్ముదులిపే ప్లాన్ వేస్తోంది… అందుబాటు ధరల్లో సెట్ టాప్ బాక్స్‌లు అందించడంతో పాటు తక్కువ ధరకే తన సేవలను అందించనుంది. సెట్ టాప్ బాక్స్‌లు సిద్ధమయ్యాయని, ఇక సర్వీస్‌ను ప్రారంభించడమే తరువాయి అని జియో ప్రకటించింది. అంతేకాదు జియో సెట్ టాప్ బాక్స్‌ను ఇంటర్‌నెట్ సేవలకు అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిపింది. ఇప్పటికే దీనికోసం ప్రధాన నగరాల్లో పనులు ప్రారంభించినట్లు పేర్కొంది. డీటీహెచ్ ధర రూ. 1800గా ప్రకటించిన జియో… నెలకు రూ.180కి సేవలను అందించనుంది. జియో డీటీహెచ్‌ను ఈ ఏడాది మే నెలలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల నుంచే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.