నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటే…

ప్రధాని నరేంద్ర మోదీ… తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక్కటేనంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఖర్గే. పీఎం, సీఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఓ శక్తి అని పేర్కొన్నారు ఖర్గే… ఆయన పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు అంబేద్కర్‌ను బీజేపీ ఎందుకు మర్చిపోయిందని ప్రశ్నించారు. దళితుల ఓట్ల కోసమే అంబేద్కర్ గురించి బీజేపీ మాట్లాడుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను మరువలేదన్నారు మల్లికార్జున ఖర్గే… ఆయన చూపిన విధానాలు ఆచరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించే సమయమేలేదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఖర్గే. తెలంగాణ సీఎం మాత్రం 25 శాతం చొప్పున రుణమాఫీ చేయటం విడ్డూరం అన్నారు. సోనియాగాంధీ చొరవ తీసుకోకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించిన ఖర్గే… దేశ ప్రజలను మోదీ, రాష్ట్ర ప్రజలను కేసీఆర్ వెర్రివాళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన పనులను కూడా మోదీ ప్రారంభిస్తూ తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.