రవిశంకర్‌పై గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం…

యమునా తీరంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవ నిర్వహణ గురించి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా అని రవిశంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల వల్ల యమునా తీరం దెబ్బతిందని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆరోపించింది.

ఈ ఆరోపణలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ఖండించారు. దీనిపై ఇటీవల ఫేస్‌బుక్‌ వేదికగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్సవాలకు అవసరమైన అన్ని అనుమతులను ఎన్‌జీటీ నుంచి పొందాం. యమునా నది అంత స్వచ్ఛమైనదీ, సున్నితమైనదీ అయితే ప్రారంభంలోనే ఈ ఉత్సవాన్ని నిలిపివేయాలి. ఈ విషయంలో జరిమానా ఏదైనా విధించాల్సి వస్తే అనుమతులిచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్‌జీటీలకు విధించాలి అని రవిశంకర్‌ వ్యాఖ్యలు చేశారు. రవిశంకర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. పర్యావరణాన్ని పరిరక్షించటంలో మీకు బాధ్యత లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.