రాజమౌళి శిష్యుడు సెంటిమెంట్ ను తిరగరాస్తాడా..?

అపజయమెరుగని దర్శకుడు రాజమౌళి ఇండస్ట్రీలో రికార్డ్స్ సృష్టిస్తుంటే అతని దగ్గర నుండి వస్తోన్న శిష్యులు మాత్రం గురువు వారసత్వాన్ని కొనసాగించడంలో దారుణమైన ఫలితాలను అందుకుంటున్నారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన కరుణ్ కుమార్ అనే దర్శకుడు ‘ద్రోణ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ సినిమాను తన ఖాతాలో వేశాడు. ఆ తరువాత మహదేవ్ అనే మరో శిష్యుడు ‘మిత్రుడు’ అనే ఫ్లాప్ సినిమాను చేశాడు. రీసెంట్ గా ఆయన చేసిన ‘జాగ్వార్’ సినిమా పరిస్థితి కూడా అంతే. అలానే రాజమౌళి ప్రియ శిష్యుడు జగదీష్ తలశిల కూడా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. ఇలా రాజమౌళి క్యాంప్ నుండి వచ్చిన ఏ ఒక్క దర్శకుడు కూడా సరైన సినిమా చేయలేకపోయారు.

తాజాగా ఆయన శిష్యుల్లో ఒకరైన పళని ‘ఏంజెల్’ అనే సినిమా చేశారు. ఇతడు బాహుబలి పార్ట్1 కి పని చేయడంతో ఆ సినిమా పేరును తన ఇంటిపేరుగా వేసుకొని బాహుబలి పళని అని పిలిపించుకుంటున్నారు. ఆయన రూపొందించిన ‘ఏంజెల్’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి మిశ్రమ స్పందన లభిస్తున్నా.. చిత్రబృందం మాత్రం సక్సెస్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ డైరెక్టర్ అయినా సక్సెస్ ను అందుకొని రాజమౌళి శిష్యుల మీద ఉన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి!