అమెరికా కంపెనీలు కూడా భారత్‌లో ఉన్నాయి జాగ్రత్త…

హెచ్-1బీ వీసాల్లో అమెరికా నిబంధనలు కఠినతరం చేయడంపై భారత్ ఆగ్రహించింది. ఈ నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నా వారు వెనక్కి తగ్గకపోవడంతో ఆ ప్రభుత్వానికి భారత్ హెచ్చరికలు జారీచేసింది. అమెరికా కంపెనీలు కూడా భారత్‌లో వ్యాపారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని అమెరికా అథారిటీలు దృష్టిలో ఉంచుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు.

“కేవలం భారత కంపెనీలు మాత్రమే అమెరికాలో లేవు. పెద్ద పెద్ద అమెరికా కంపెనీలు కూడా భారత్‌లో ఉన్నాయి. అవన్నీ భారీ ఎత్తున్న భారత్ మార్కెట్లో ఆదాయాలు ఆర్జిస్తున్నారు. ఆ ఆదాయాలను అమెరికా ఆర్థికవ్యవస్థకు తీసుకెళ్తున్నారు. అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో కేవలం భారత్ కంపెనీలే ప్రభావితం కావు. కొన్నేళ్లుగా భారత్‌లో వ్యాపారాలు చేస్తున్న పెద్దపెద్ద అమెరికా కంపెనీలపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ వీసా ఆందోళనలు ఇలానే కొనసాగిస్తే, మేము వాటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటాం. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు వ్యవహరించాలి” అని నిర్మలా సీతారామన్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.