కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో బ్రహ్మానందం ఎంతో, తమిళంలో వడివేలు అంత. పైపెచ్చు ఆయన సినిమాలకు ఈయన, ఈయన సినిమాలకు ఆయన వెర్షన్ మార్చి డబ్బింగులు చెప్పుకుంటారు.
అయితే ఇప్పుడు టాపిక్ వడివేలు గురించి. సౌత్ ఇండస్ట్రీస్‌లో అంత పెద్ద స్టార్ కమెడియన్ అయిన వడివేలు సాటి నటుడి చేతిలో దారుణంగా మోసపోయారు. నకిలీ డాక్యుమెంట్లని తెలియక చెన్నయ్ శివారులో ఓ స్థలం కొనేశారు వడివేలు. ప్రస్తుతం ఈ మోసానికి సంబంధించిన పంచాయితీ కోర్టు పరిధిలో నడుస్తోంది. ఓ ఐదుగురితో కలిసి సింగముత్తు అనే నటుడే ఈ ల్యాండ్‌ను డీల్ చేసి పెట్టాడట. అందువల్ల వడివేలు సదరు నటుడిపైనే కేసు వేశారు. ఈ ఇద్దరినీ మాట్లాడుకోవటానికి రావాల్సిందిగా ఇటీవలే హై కోర్టు ఆర్డర్ వేసింది. కానీ పిలిచిన రోజు వెళ్లకుండా డుమ్మా కొట్టినందుకు మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సొచ్చింది. ఈ గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు కోర్టుకి వివరణ సమర్పించారు. ప్రస్తుతం కేసు విచారణలోనే ఉంది.