గోపిచంద్ విలన్ కాదట…

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గౌతమ్ నంద’. అయితే ఈ సినిమాలో గోపిచంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని, అందులో ఒకటి విలన్ రోల్ అని రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే వాటిలో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాలో ముఖేష్ రుషి, తంగబలి విలన్ల పాత్రల్లో కనిపించబోతున్నారని అన్నారు. గోపిచంద్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి తప్ప ఆయన ద్విపాత్రాభినయం పోషించడం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలు తెలియజేస్తూ.. ”రమణ మహర్షి రచించిన ‘హూ యామ్ ఐ’ అనే పుస్తకం స్ఫూర్తిగా గౌతమ్ నంద పాత్ర రాసుకున్నాను. డబ్బు, హోదా, పరపతి ఉన్న వ్యక్తి వాటిపై విరక్తి చెంది సామాన్య జనంలోకి వచ్చి ఓ సాధారణ వ్యక్తిగా ఎలా బ్రతుకుతాడనేదే సినిమా కథ” అని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఓ రెండు, మూడు సినిమాల కలయికతో ఈ సినిమా ఉంటుందనే సందేహాలు కలుగుతున్నాయి. మరి సంపత్ నంది తెరపై ఎలా ఆవిష్కరించాడో.. చూడాలి!