లండన్‌లో మళ్లీ కలకలం.., పాదచారులపైకి దూసుకెళ్లిన వాహనం…

లండన్‌లో మరో దారుణం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం పాదచారులపైకి ఓ వాహనం దూసుకెళ్లి బీభత్సం సృష్టించగా, అందులో పలువురు చనిపోగా, మరికొంతమంది గాయపడ్డారు. తాజాగా లండన్‌లోని సెవెన్‌ సిస్టర్స్‌ రోడ్డులోగల ముస్లింల సంక్షేమ భవనం దగ్గర అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తున్న ముస్లింలపై ఓ వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

ప్రస్తుతానికి ఈ సంఘటనను తీవ్రమైనదేనని చెబుతున్న పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా అతడు ఇలా చేశాడా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఎక్కడికక్కడ అప్రమత్తమై మరోసారి అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. మొత్తం 12మంది ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం.