మాల్యాను కోర్టుకు తీసుకొస్తేనే విచారణ…

కోర్టు ధిక్కార కేసులో మాల్యాను నేరుగా న్యాయస్థానం ముందు హాజరు పరిస్తేనే తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కోర్టు నేడు తీర్పు చెప్పాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్రం అందించిన తాజా నివేదికలను పరిశీలించింది. మాల్యాను తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని కేంద్రం నివేదికలో పేర్కొంది. అయితే మాల్యా వస్తేనే తదుపరి విచారణ జరుపుతామన్నది కోర్టు మాట.

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాపై ఇప్పటికే సుప్రీంకోర్టు సహా పలు కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టులో విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి చాలాసార్లు ఆదేశించినా.. మాల్యా పట్టించుకోలేదు. దీంతో ఆయనపై ధిక్కార కేసు నమోదైంది. దీనిపై మే 9న విచారణ చేసిన న్యాయస్థానం మాల్యాను దోషిగా తేల్చింది. తీర్పును జులై 14కు వాయిదా వేసింది. అయితే శిక్ష ఖరారు చేసేందుకు మాల్యా హాజరు కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. శుక్రవారం కూడా మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల్యా రావాల్సిందేనని, అంతవరకూ విచారణ చేపట్టేది లేదని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కార కేసులో మాల్యాకు ఆరు నెలల జైలు శిక్ష లేదా 2వేల రూపాయల జరిమానా లేదా రెండూ పడే అవకాశముంది.