టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది…

టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. ఒరిజినల్ టీఆర్ఎస్ పక్కకెళ్లి.. ఉద్యమ ద్రోహులంతా ప్రభుత్వంలో కీలక స్థానాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. విద్యార్థి లోకం కదిలితే కేసీఆర్ కు పుట్టగతులుండవని హెచ్చరించారు షబ్బీర్. కోదండరాంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కోదండరాంను ఎవరేమన్నా ఊరుకునేది లేదన్న కేసీఆర్… ఇప్పుడు అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారని నిలదీశారు.

కేసీఆర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని, కోదండరాంను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు షబ్బీర్ అలీ… టీఆర్ఎస్ కు విద్యార్థులపైనా కసి పెరిగిందన్నారాయన. అమరుల స్ఫూర్తియాత్రలో పాల్గొంటున్న విద్యార్థులపై కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన విద్యార్థులపై దాడి చేయటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు షబ్బీర్. ఉమ్మడి రాష్ట్రంలో మంచి పేరున్న పోలీస్ వ్యవస్థను.. తెలంగాణ రాష్ట్రంలో చెడగొట్టారని మండిపడ్డారు షబ్బీర్ అలీ. పోలీసులు రోజురోజుకీ టీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిపోతున్నారని ఆరోపించారు. ఎస్సైని ఎమ్మల్యే కొడితే.. ఎస్సై మీదే రివర్స్ కేసు పెట్టారంటే.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో అర్థమవుతోందన్నారు షబ్బీర్.