పాతిక వ‌సంతాల ప్ర‌యాణం…

రాజ్‌ కపూర్‌ – నర్గీస్‌… అమితాబ్‌ బచ్చన్‌ – రేఖ… ఈ జోడీల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన రేర్‌ ఫీట్ షారుఖ్‌ ఖాన్‌ – కాజోల్ జోడీకి సాధ్య‌మైంది. బాలీవుడ్‌లోనే మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ జోడీగా షారూక్ – కాజోల్ జంట‌కు పేరుంది. ఈ జోడీకి బాలీవుడ్‌లో 25 వ‌సంతాలు. రెండున్నర ద‌శాబ్ధాల కెరీర్‌లో అభిమానులు అనునిత్యం స్మ‌రించే అరుదైన పెయిర్ గా చ‌రిత్ర‌ను సృష్టించారు. షారూక్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించిన `భాజిఘ‌ర్‌` చిత్రంలో కాజోల్ అత‌డికి పెయిర్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా `దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే` చిత్రంలోనూ సేమ్ పెయిర్ రిపీటైంది. ఈ సినిమా సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో తెర‌కెక్కిన ఎన్నో ప్రేమ‌క‌థా చిత్రాల‌కు ఈ సినిమా ఓ స్ఫూర్తి.

ప‌లు క్రేజీ సినిమాల్లో క‌లిసి న‌టించిన షారూక్ – కాజోల్ జోడీకి ఈ ఏడాదితో పాతిక వ‌సంతాలు పూర్త‌వుతోంది. ప్రేమ‌క‌థా చిత్రాల్లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించిన డీడీఎల్‌జే తో షారూక్ – కాజోల్ జంట‌కు అసాధార‌ణ క్రేజు పెర‌గ‌డ‌మే కాదు, ఆ త‌ర్వాత ఈ జంట క‌లిసి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. కుచ్ కుచ్ హోతా హై, క‌భీ ఖుషీ క‌భీ ఘ‌మ్‌, మై నేమ్ ఈజ్ ఖాన్‌, దిల్ వాలే వంటి చిత్రాల్లో జంట‌గా న‌టించారు.