ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి, టెర్రరిస్ట్ హతం…

జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాయుడు. జైనపొరాలోని అవ్నీరాలో టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు నిన్న సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో… టెర్రరిస్టులు సైన్యంపై కాల్పులు జరిపి పారిపోయారు. అయితే… ఇవాళ ఉదయం మళ్లీ టెర్రరిస్టులు కనబడటంతో.. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులకు గాయాలవగా… వారిని బేస్ క్యాంప్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు చనిపోయారు. ఎన్‌కౌంటర్ ఇంకా జరుగుతోంది. ఓ టెర్రరిస్టును సైన్యం మట్టుబెట్టింది. మరోవైపు… బందీపురలోనూ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులపై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు.