ఇక ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళకు ఆధార్ తప్పనిసరి

భారత్‌లో జరిగే ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల రిజిస్ర్టేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ సూచించింది. ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల వివాదాలు, ఇతర సంబంధిత అంశాలను దీటుగా ఎదుర్కోవాలంటే ఆధార్ తప్పనిసరి చేసేలా కమిటీ పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐ భర్తలు వదిలివేస్తున్న మహిళల హక్కుల పరిరక్షణ, గృహహింస, కట్న వేధింపుల బాధితులకు సహాయపడేందుకు ఇది దోహదపడుతుందని కమిటీ తెలిపింది. ఈ మేరకు నిపుణుల కమిటీ గత నెల 30న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.

అయితే నిందితుల అప్పగింత కోసం భారత్‌ పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో కట్నం వేధింపులను కూడా చేర్చాలని నివేదికలో కమిటీ కీలకమైన సూచన చేసింది. ఇక ఎన్‌ఆర్‌ఐలు, భారత విదేశీ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఆధార్‌ నమోదుకు అవసరమైన విధానంపై యూఐడీఏఐ కసరత్తు చేస్తుంది. కాగా ప్రస్తుతం భారతీయులతో పాటు వీసాలు సరిగ్గా ఉన్న విదేశీయులు కూడా ఆధార్‌ నమోదు చేసుకునే అవకాశం ఉంది.