ఈ నెల 21 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు…

ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి… దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు… వర్షా కాలం కావడంతో రెయిన్ ప్రూఫ్ పట్టాలు వేయించాలని ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. క్యూ లైన్లలో మంచినీటి సరఫరా, అన్నప్రసాదం అందించనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా వెయ్యి బస్సులు నడప నుంది.

దుర్గమ్మ దర్శనం టికెట్ల ధరల తగ్గింపుపై చర్చిస్తున్నామని తెలిపారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు… దర్శన టికెట్ల ధరల తగ్గింపుపై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు దేవినేని. మరోవైపు దసరా ఉత్సవాలకు భక్తులు లక్షల్లో వస్తారన్న అంచనాలు ఉండడంతో… 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు పోలీసు ఉన్నతాధికారులు. సీసీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఫ్లైఓవర్ మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు కలెక్టర్… వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.