కేసీఆర్ కు ఉపరాష్ట్రపతి అభినందనలు

ఒకటవ తరగతి నుండి ఇంటర్‌ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వెంకయ్యనాయుడు ట్విటర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎవరికి వారు మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. వీలైనంత త్వరలో ఏపీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించడం విశేషం.