ఉగ్రవాదులకు ఏం పుచ్చుకోలేదు!

యెమెన్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న కేరళకు చెందిన క్రైస్తవ మతప్రబోధకుడు ఫాదర్‌ టామ్‌ ఉజున్నలీల్‌ను విడుదల చేసేందుకు ఎలాంటి నగదు చెల్లించలేదని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పని నిశ్శబ్దంగా చేసినా.. చివరికి పూర్తవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉజున్నలీల్‌ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని.. యెమెన్‌ ప్రభుత్వ సహకారంతో విదేశీ వ్యవహారాల శాఖ అనేక మార్గాల్లో ప్రయత్నించడంతోనే ఈ ఫలితం దక్కిందని ఆయన తెలిపారు.

కాగా 2016 మార్చిలో యెమెన్‌లోని ఎడెన్‌ నగరంలో స్థానిక మిషనరీలు నిర్వహిస్తున్న ఓ వృద్ధాశ్రమంపై నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 16మందిని పొట్టన పెట్టుకుని కేరళకు చెందిన ఉజున్నలీల్‌ను అపహరించుకపోయారు. కాగా తాను ఉగ్రవాదుల చెరలో నరకం అనుభవిస్తున్నానని.. ఎలాగైనా విడిపించాలని ఉజున్నలీల్‌ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వీడియో గత డిసెంబర్‌లో బయటకు వచ్చింది. దీంతో స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఉజున్నలీల్‌ విడుదలకు సహకరించాలని యెమెన్‌ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. చివరికి 18 నెలల తర్వాత ఆయన విడుదలైనట్లు ఒమన్‌ అధికార వార్తాసంస్థ ఓఎన్‌ఏ వెల్లడించింది. ఆయన ఫోటోను కూడా విడుదల చేసింది.