`ధూమ్ -2`లో హృతిక్ రోషన్‌ని, `ధూమ్ -3`లో అమీర్ ఖాన్ని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో చూశాం. హృతిక్, అమీర్ ఎవరికి వారే.. తమదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఈ భారీ యాక్షన్ ఎడ్వంచరస్ సిరీస్‌లో అన్‌లిమిటెడ్‌గా సినిమాలు తెరకెక్కించేందుకు యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే `ధూమ్ 4`కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. మనీష్ శర్మ ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. తనే ఈ నాలుగో భాగానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ మేరకు ఆదిత్య చోప్రా నుంచి మనీష్‌కి క్లారిటీ వచ్చిందిట.
ఇక పోతే పార్ట్ -4లో కింగ్ ఖాన్ షారూక్ నెగెటివ్ పాత్రను లీడ్ చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది. షారూక్ ఇంతవరకూ సంతకం చేయలేదు. కానీ మాటిచ్చాడు. ఆ మేరకు మనీష్ స్క్రిప్టులో మార్పు చేర్పులు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ పాత్ర కోసం తొలుత సల్మాన్ ఖాన్ని సంప్రదించారు. కానీ సల్మాన్ అప్పటికే `రేస్ 3`కి సంతకం చేయడంతో చేయడం కుదరదని తేల్చి చెప్పేశాడుట. ఆ క్రమంలోనే కింగ్ ఖాన్ లైన్లోకొచ్చాడు. `ధూమ్ -3`కి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య అలియాస్ విక్టర్ ప్రస్తుతం అమీర్-బిగ్బిల `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`కి దర్శకత్వం వహిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి పనిచేయడం లేదని తెలుస్తోంది. `ధూమ్ 4` 2019 క్రిస్మస్ (డిసెంబర్) కానుకగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఆ మేరకు ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్విట్టర్లో వివరాలందించారు.