12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్టీఐ..!

సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి కరెక్టుగా ఈరోజుకి 12 ఏళ్లు పూర్తైంది. ఈ 12 ఏళ్లలో సమాచార హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే అవకాశం లభించింది. అంటే.. అసలు సమాచార హక్కు చట్టం గురించి కొన్ని విషయాలు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సగటున రోజూ ఆర్టీఐ చట్టంకింద 4,800 దరఖాస్తులు నమోదవుతున్నాయి. అక్టోబర్‌ 2005 నుంచి అక్టోబర్‌ 2016 వరకూ.. మొత్తం కోటి 75 లక్షల దరఖాస్తులు ఆర్టీఐ చట్టం కింద నమోదయ్యాయంటే దాని ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. ఒక్క 2015-16లోనే 11 లక్షల 75 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 65 మంది ఆర్టీఐ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. అదే విధంగా 400 మంది కార్యకర్తలను వివిధ రకాల వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్టీఐపై ఇప్పటికీ అవగాహన రాలేదు. ఈ 12 సంవత్సరాలలో కేవలం 14 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తులు రావడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.