దీపిక `ప‌ద్మావ‌తి`కి ముందే త‌మిళ్ క్లాసిక్‌..!

చిత్తూర్ రాణి ప‌ద్మిని జీవిత‌క‌థ‌పై సంజ‌య్‌లీలా భ‌న్సాలీ `ప‌ద్మావ‌తి` చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆరంభం నుంచి వివాదాల్లో న‌లుగుతోంది. డిసెంబర్‌లో రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతున్న వేళ వివాదాలు మ‌రింత‌గా పెచ్చుమీరుతున్నాయి. ఈ సినిమా రిలీజ్‌ని అడ్డుకుంటామంటూ రాజ్‌పుత్ క‌ర్ణి సేన‌లు, హిందూ సేన‌లు బోలెడంత హైరానా క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లుచోట్ల దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి క‌ర్ణి సేన‌లు.

అయితే భ‌న్సాలీకి అండ‌గా నిలుస్తూ ప‌లువురు ప్ర‌తిదాడులు చేస్తున్నారు. ఇదివ‌ర‌కే ఇండియ‌న్ సినీ,టీవీ ద‌ర్శ‌క‌సంఘం `ప‌ద్మావ‌తి` రిలీజ్‌కి అండగా నిలుస్తామ‌ని ప్ర‌క‌టించింది. స‌ల్మాన్ ఖాన్‌, సీబీఎఫ్‌సీ మాజీ ఛైర్మ‌న్ ప్ర‌హ్లాద్ నిహ‌లానీ వంటివాళ్లు ఈ సినిమా రిలీజ్‌ని అడ్డుకోవ‌డం స‌రైన‌ది కాద‌ని చెబుతున్నారు. సినిమాల‌ రిలీజ్‌ని రాజ‌కీయం చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ప్ర‌హ్లాద్ నిహలానీ మాట్లాడుతూ -“దీపిక ప‌దుకొన్ న‌టించిన ప‌ద్మావ‌తి కంటే ముందే త‌మిళంలో ఇదే క‌థ‌తో `చిత్తూర్ రాణి ప‌ద్మిని` పేరుతో సినిమా రూపొందించారు. ప్ర‌ఖ్యాత వైజ‌యంతి మాల చిత్తూర్ రాణి ప‌ద్మావ‌తిగా న‌టించారు. త‌మిళ సూప‌ర్‌స్టార్ శివాజీ గ‌ణేష‌న్ మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర‌లో, ప్ర‌ఖ్యాత‌ ఎం.ఎన్‌.నంబియార్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో న‌టించారు. అయితే నాడు ఆ క్లాసిక్ సినిమా పెద్ద ఫ్లాప్. సినిమా ఫ్లాపైనా వైజ‌యంతి మాల డ్యాన్స్ సీక్వెన్సుల గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు“ అని నిహ‌లానీ తెలిపారు. 1963లో `ప‌ద్మావ‌తి`పై సినిమా రిలీజైన‌ప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు? అప్పుడు రిలీజ్‌ని ఆప‌లేదు క‌దా? అంటూ ప్ర‌శ్నించారాయ‌న‌.