రెండో టెస్టుకు పేస్, బౌన్స్‌తో కూడిన పిచ్

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జయకేతనం వేగురవేసి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు రెండో టెస్టు కీలకం అయింది. ఈ రెండో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తేనే సిరీస్‌ పోరులో నిలుస్తుంది. లేదా మొదటి టెస్ట్ ఫలితాన్నే పునరావృతం చేస్తే ఇంకో టెస్టు మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. ఇక సెంచూరియన్‌లో జరిగే రెండో టెస్ట్ కోసం పేస్, బౌన్స్ పిచ్ ను తయారు చేసినట్లు క్యూరేటర్ బ్రయన్ బ్లాయ్ తెలిపాడు.

క్యూరేటర్ బ్రయన్ బ్లాయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. ‘సెంచూరియన్‌లోని పిచ్ పేస్, బౌన్స్‌ కి తోడు స్వింగ్ కు కూడా సహకరిస్తుందని తెలిపాడు. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ బౌన్స్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అన్నాడు. స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్, రబాడా వంటి స్టార్ పేసర్లు ఉన్న సౌతాఫ్రికాకు ఇది మరింత ఉత్సాహాన్నిచ్చేదే. కానీ ఇండియన్ బ్యాట్స్‌మెన్‌కు మరో పరీక్ష అని అన్నాడు. వాస్తవానికి ఈ పిచ్ సహజంగానే పేస్‌, బౌన్స్ కు అనుకూలిస్తుంది… ఈ పిచ్ ని ప్రత్యేకంగా ఏమీ తయారుచేయలేదు అని బ్లాయ్ తెలిపాడు. పొడి వాతావరణం ఉండటం వలన పిచ్‌పై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అయితే స్పిన్నర్లకు అనుకూలించేంతలా ఉండదని అన్నారు. పిచ్ మీద ఉన్న పగుళ్ల వల్ల బౌన్స్ ఎక్కువ తక్కువ అవుతుంది అని తెలిపారు’. ఇలాంటి కఠిన పిచ్ పై భారత బ్యాట్స్ మేన్స్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. మొదటి టెస్ట్ ఓటమితో విమర్శల పాలు అయిన భారత్ రేపటి టెస్ట్ లో మార్పులతో బరిలోకి దిగి విజయం సాధించి రేసులో నిలవాలని చూస్తుంది.