ప్రపంచ నేతలపై ‘గాలప్’ సర్వే.. వరల్డ్ నంబర్ 3 గా మోడి..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వీరందరూ మన ప్రధాని మోడీ కంటే చాలా వెనకబడిపోయారు. అదెలాగంటే…ప్రపంచ అత్యుత్తమ నేతల విషయంలో నరేంద్ర మోడీ మూడో స్థానంలో నిలిచినట్టు గాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా గాలప్ సర్వే నేతలకు ర్యాంకులను ప్రకటించింది.

కాగా ఈ సర్వేలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో నిలిచారు. ఆమె పట్ల 49 శాతం మంది సానుకూలతను వ్యక్తపరిస్తే… వ్యతిరేకంగా కేవలం 29 శాతం మందే ఉన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ రెండవ స్థానంలో ఉంది. అయితే.. మన ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా 30 శాతం మంది.. వ్యతిరేకంగా 22 శాతం మంది అభిప్రాయాన్ని తెలిపారు. అయితే నాలుగో స్థానంలో బ్రిటన్ ప్రధాని థెరీసామే, ఐదో స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. అయితే ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ, టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ ఉన్నారు. కానీ ప్రపంచాన్నే శాసించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మాత్రం 11వ స్థానం దక్కడం విశేషం. ట్రంప్ పట్ల 31 శాతం అనుకూలంగా ఉంటే… ప్రతికూలంగా 58 శాతం మంది నిలిచినట్లు గాలప్ సర్వే వివరించింది.