ట్రంప్ వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోటు దురుసు ఎక్కువ… ఏదో ఒక విషయంలో నోరుజారకుండా ఉండలేడు. తాజాగా హైతీ, ఆఫ్రికా దేశాలను కించపరిచేలా కామెంట్ల్ చేసి… విమర్శల పాలవుతున్నాడు ట్రంప్. హైతీ, ఆఫ్రికన్‌ వంటి చెత్త దేశాల ఇమ్మిగ్రెంట్లను తమ దేశానికి ఎందుకు అనుమతించాలన్నారాయన… డెమోక్రాటిక్‌ సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రహాంలు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో బైపార్టిసన్‌ ఇమ్మిగ్రేషన్‌ డీల్‌ గురించి చర్చిస్తుండగా ఘాటుగా వ్యాఖ్యానించారాయన. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఐక్యరాజ్యసమితి… ఒకవేళ ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే… అవి షాక్‌కు గురిచేస్తున్నాయని, ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల సంఘం అంటుంది.

నార్వేలాంటి దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్లను అమెరికా ఆహ్వానించాలి కానీ, ఆఫ్రికా, హైతీ వంటి చెత్త దేశాల నుంచి కాదంటూ డొనాల్డ్ ట్రంప్‌ చేసిన జాతివివక్ష వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు అనేక మంది జీవితాలను నాశనం చేసే విధంగా ఉన్నాయని పేర్కొంది ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల సంఘం. ఆయన నీచమైన భాషను వాడుతున్నారని విమర్శించింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ఆఫ్రికన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.