మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

నగర పోలీసులు ఎప్పటికప్పుడు డ్రంకెన్ డ్రైవ్‌లు చేపడుతున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. డ్రంకెన్ డ్రైవ్‌లు చేపడుతున్నా అవేమి పట్టనట్టు యువత మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా హైదరాబాద్‌‌లోని ఫిల్మ్‌నగర్‌ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

విశ్వజిత్ అనే యువకుడు మణికొండలో జరిగే పార్టీకి స్నేహితులతో కలిసి వెళ్ళాడు. పార్టీలో మద్యం సేవించి కారులో తిరిగి వస్తుండగా ఫిల్మ్‌నగర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని చాలా దూరం పల్టీలు కొట్టింది. చివరికి చెట్టును డీ కొనడంతో కారు ఆగింది. ఈ ప్రమాదంలో విశ్వజిత్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి డ్రంకెన్ డ్రైవే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.