కాపీ క్యాట్: `అరుంధ‌తి` మిస్స‌యినా, `అజ్ఞాత‌వాసి`కి నోఛాన్స్‌!

కాపీ కొట్ట‌డం అనే క‌ళ ఇప్ప‌టిది కాదు! అనాదిగా వ‌స్తున్న‌దే. ఓల్డ్ క్లాసిక్స్ కాలంలోనే ఇరుగు పొరుగు భాష‌ల నుంచి స్ఫూర్తి పొంది .. కొన్ని సీన్ల‌ను య‌థాత‌థంగా తెర‌కెక్కించిన సంద‌ర్భాలున్నాయి. తాము వీక్షించిన సినిమాల్లో త‌మ‌ను బాగా ఇన్‌స్ప‌యిర్ చేసిన సీన్స్ ను తీసుకుని త‌మ సినిమాల్లో ఏదో ఒక సంద‌ర్భానికి దానిని అన్వ‌యించుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. అలా హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌, టాలీవుడ్‌లో కాపీలెన్నో. అయితే అప్ప‌ట్లో కాపీ రైట్ తిప్ప‌లేం లేవు. కాపీ రైట్స్‌కి సంబంధించిన బ‌ల‌మైన చ‌ట్టాలు లేవు. అందువ‌ల్ల కాపీ చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు. పైగా అప్ప‌ట్లో ఇప్పుడున్నంత మీడియా కూడా లేక‌పోవ‌డంతో కాపీల‌కు పెద్ద‌గా ప్ర‌చారం ద‌క్కేది కాదు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ఇలా కాపీ చేస్తే, అలా ఇన్వ‌స్టిగేటివ్ జ‌ర్న‌లిస్టులు తాట తీస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాల్లో ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డ కాపీ చేశారు? ఏ హాలీవుడ్ సినిమా నుంచి లిఫ్ట్ చేశారు? అన్న‌ది ప‌సిగ‌ట్టేసి దానిని అంత‌ర్జాతీయ స్థాయిలో వెబ్ మాధ్య‌మం ద్వారా చాకిరేవు పెడుతున్నారు. ఆ ఫ‌లితం అంతే దారుణంగా ఉంటోంది.

అప్ప‌ట్లో అరుంధ‌తి సినిమాలో ఓ సీన్ చైనీ మూవీ `ది హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డ్రాగ‌ర్స్‌`లోని ఓ స‌న్నివేశానికి కాపీ. అనుష్క గాల్లో ఎగురుతూ చీర అంచుల‌తో డ్ర‌మ్స్ వాయిస్తుంది. ఆ సీన్ మ‌హ‌దాద్భుతంగా పండింది. అయితే అది ఓ చైనీ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్న‌ది అన్న సంగ‌తి ఆ త‌ర్వాత కానీ తెలియ‌లేదు. అయితే అప్ప‌టికే సినిమా పెద్ద హిట్ట‌యింది. ఆ వార్త‌కు అంత ప్రాచుర్యం రాలేదు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్‌ల `అజ్ఞాత‌వాసి`లో కాపీ క్యాట్ సీన్స్ గురించి మీడియా చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. దీనివ‌ల్ల అంత‌ర్జాతీయ వేదిక‌పై మ‌న ప‌రువు కూడా పోయింది. ఫ్రెంచి ద‌ర్శ‌కుడు జెరోమ్ స‌ల్లే నేరుగా అజ్ఞాత‌వాసి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నోటీసులు పంపించే స‌న్నివేశం క‌నిపిస్తోంది. “నెల‌రోజులుగా ఎదురు చూస్తున్నా. ఎవ‌రూ స్పందించ‌డం లేదు..“ అంటూ జెరోమ్ స‌ల్లే నాలుగురోజుల క్రితం వార్నింగ్ కూడా ఇచ్చాడు. అప్పుడు అరుంధ‌తి త‌ప్పించుకున్నా, ఇప్పుడు అజ్ఞాత‌వాసి త‌ప్పించుకోలేడు అన్న చందంగా ఉంది సీన్‌. మ‌రి ఈ స‌న్నివేశం నుంచి అజ్ఞాత‌వాసి మేక‌ర్స్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.