ప్యాడ్‌మ్యాన్ రిపోర్ట్‌: తొలి వీకెండ్ 65 కోట్లు

సామాజిక సందేశం పేరుతో డ‌బ్బు నొల్లుకుంటున్నాడు. కాన్సెప్టును బ‌లంగా జ‌నాల్లోకి పంప్ చేయ‌డం ద్వారా కావాల్సిన ప్ర‌చారం తెచ్చుకుని, భారీ ప్ర‌మోష‌న్స్‌తో ఆక‌ట్టుకుని, నిర్మాత‌ల జేబులు నింపుతున్నాడు కిలాడీ అక్ష‌య్‌కుమార్‌. స్వ‌చ్ఛ‌భార‌త్ కాన్సెప్టుతో తెర‌కెక్కిన `టాయ్‌లెట్‌-ఏక్ ప్రేమ‌క‌థ‌` ప‌రిమిత బ‌డ్జెట్ తో తెర‌కెక్కి బంప‌ర్ హిట్ కొట్టింది. లేటెస్టుగా మ‌రోసారి సామాజిక సందేశం ఉన్న కాన్సెప్టుతోనే జ‌నం ముందుకు వ‌చ్చాడు అక్కీ. ఆడ‌వారు ఉప‌యోగించే నాప్కిన్ త‌యారు చేసిన మ‌హామ‌హుని బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాన‌ని చెబుతూ బోలెడంత ప్ర‌చారం చేసుకున్నాడు. ఆ ప్ర‌చారం గొప్ప‌గా క‌లిసొచ్చింది. అస‌లు ఒక మామూలు సాధాసీదా తెలుగు సినిమానే 40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంటే అక్ష‌య్ కుమార్ హీరోగా 20 కోట్ల (అక్ష‌య్ పారితోషికం మిన‌హా) బ‌డ్జెట్‌తో సినిమా తీసి 100 కోట్ల క్ల‌బ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది రియ‌ల్ సెన్సేష‌న్ అనే చెప్పాలి.

మొన్నటికి మొన్న‌ రిలీజైన ప్యాడ్ మ్యాన్ తొలి మూడు రోజుల్లోనే 46 కోట్లు వ‌సూలు చేసింది. తొలి వారం రోజుల్లోనే ఈ సినిమా 60-65 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అటుపై 100 కోట్ల క్ల‌బ్ వైపు అడుగులు వేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అదంతా అక్కీ స్టార్ ప‌వ‌ర్, అత‌డు ఎంచుకున్న కాన్సెప్టు సాధించిన విజ‌యంగా భావించాలి. వాస్త‌వానికి ప్యాడ్‌మ్యాన్‌కి ఖ‌ర్చు చేసిన 20 కోట్ల బ‌డ్జెట్ రిలీజ్ ముందే శాటిలైట్‌, ఆడియో, డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు థియేట్రిక‌ల్ రిలీజ్ ద్వారా వ‌స్తోంది అంతా లాభాల ఖాతాలోకే. అంటే ఇప్ప‌టికే నిర్మాత‌ల‌కు 45 కోట్ల లాభం వ‌చ్చింద‌న్న‌మాట‌! బాప్‌రే.. మ‌న‌వాళ్లు చూసైనా నేర్చుకుంటారేమో!