హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాదే…

26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను ఇంతకాలం వెనుకేసుకు వచ్చిన పాకిస్థాన్… ఎట్టకేలకు హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాదేనని ప్రకటించింది. హఫీజ్ సయీద్‌తో పాటు అతడికి చెందిన జమాత్-ఉద్-దావా (జేయూడీ)ను ఐక్యరాజ్యసమితి భద్రతా నిషేధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు సంతకం చేశారు. పాక్ జాతీయ కౌంటర్-టెర్రరిజం అథారిటీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అంటే పాకిస్థానీ చట్టం ప్రకారం… హఫీజ్‌ సయీద్‌ ఒక ఉగ్రవాది మరియు జమాత్-ఉద్-దావా ఒక ఉగ్రవాద సంస్థ.

సయీద్‌కు చెందిన జేయూడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆ సంస్థ సభ్యులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించిన అనంతరం… ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రత పేరుతో జేయూడీ సభ్యులు దాదాపు దశాబ్దం క్రితం బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము జేయూడీ ప్రధాన కార్యాలయంతో సహా 26 ప్రదేశాల్లో బారికేడ్లు తొలగించినట్టు లాహోర్‌ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ సంస్థ కార్యాలయాన్ని మూసివేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేస్తోంది. పాక్ అంతర్గత, విదేశీ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఈ ఆర్డినెన్స్ గురించి తెలియజేసినప్పటికీ… అధ్యక్షుడి కార్యాలయం నుండి ఈ ఆర్డినెన్స్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు ఇంకా చేరనట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో నిషేధించబడిన ఉగ్రవాద సంస్థల జాబితాలో జేయూడీ 72వది. సయీద్ గత ఏడాది గృహ నిర్బంధం నుండి విడుదలైన అనంతరం, అతని న్యాయవాది యూఎన్ భద్రతా మండలిలో తీవ్రవాదుల జాబితా నుంచి సయీద్ పేరు తొలగించాలని కోరారు… కానీ ఇది ఫలించలేదు.