షాకింగ్ లుక్‌: 80ల‌లో అనుష్క ఇలా ఉండేది!

అయ్యో పాపం ప‌సి పాపాయి.. నోట్లో వేలు పెట్టినా కొర‌క‌లేదే! అన్నంత బుద్ధిగా క‌నిపిస్తోంది క‌దూ అనుష్క శ‌ర్మ‌. ఆరోజుల్లో అలానే ఉండేవారు మ‌రి! 80ల‌లో ప‌ల్లె ప‌డుచు ఎంతో స్వ‌చ్ఛంగా ఎలాంటి హ‌డావుడి లేకుండా ఒదిగి ఉండేవాళ్లు. నేటి త‌రంతో పోలిస్తే కాస్తంత అమాయ‌క‌త్వం క‌ల‌బోసి క‌నిపించేవారు. ఇదిగో అనుష్క శ‌ర్మ‌ను అలానే చూపిస్తున్నారు ఆ సినిమాలో. సినిమా టైటిల్ `సుయ్ ధాగ‌`. `మేడ్ ఇన్ ఇండియా` అనేది ఉప‌శీర్షిక‌. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌వేశ‌పెట్టిన మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. య‌శ్‌రాజ్ ఫిలింస్ లేటెస్టుగా నాయ‌కానాయిక‌ల ఫ‌స్ట్ లుక్‌ని లాంచ్ చేసింది. ఇందులో వ‌రుణ్ ధావ‌న్‌- అనుష్క శ‌ర్మ లుక్ ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటోంది.

ఏనుగు చెవుల‌ కాల‌ర్‌.. చుక్క‌ల చొక్కాయ్‌… బెల్ ఫ్యాంటు. .. ప‌క్క పాపిడి..నూనూగు మీసం.. చేతికి తాయ‌త్తుతో అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన రూపంలో క‌నిపిస్తున్నాడు ధావ‌న్ బోయ్‌. జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారు. గోడ మాటున ఇద్ద‌రి మ‌ధ్యా ఏవో ప‌ద‌నిస‌లు జోరుగానే సాగుతున్నాయి. ఎవ‌రూ చూడ‌కుండానే అప్ప‌ట్లో ఇలాంటివి న‌డిచేవి. మొత్తానికి ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని అందించ‌నిదే ఈరోజుల్లో థియేట‌ర్ల‌కు ఎవ‌రూ రార‌ని గ్ర‌హించిన బాలీవుడ్ ఏదో ఒక సంథింగ్ అందించేందుకు త‌పిస్తోంది. అందుకే సుయ్ ధాగ‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగింది. క‌టారియా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు అనుష్క శ‌ర్మ క్యూలో పారి, జీరో, సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ ఉన్నాయి. ధావ‌న్ క్యూలో అక్టోబ‌ర్ రిలీజ్‌కి రెడీ కానుంది.